ఏపీకి పొంచి ఉన్న ముప్పు.. విపత్తుల నిర్వహణ సంస్థ బిగ్ అలర్ట్

by Vemula.Srinu Prasad |

రాష్ట్రానికి అల్పపీడనం ముప్పు పొంచి ఉంది. బీహార్ నుండి కోస్తాంధ్ర తీరప్రాంతం వరకు ద్రోణి విస్తరించి ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు...

ఏపీకి పొంచి ఉన్న ముప్పు.. విపత్తుల నిర్వహణ సంస్థ బిగ్ అలర్ట్
X

దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రానికి అల్పపీడనం ముప్పు పొంచి ఉంది. బీహార్ నుండి కోస్తాంధ్ర తీరప్రాంతం వరకు ద్రోణి విస్తరించి ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. శ్రీలంక ప్రాంతాల్లో విస్తరించి ఉన్న ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాబోయే 48 గంటల్లో నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించారు. వీటి ప్రభావంతో గురువారం వరకు కోస్తాంధ్ర,రాయలసీమలో కొన్ని ప్రాంతాల్లో మేఘావృతమైన వాతావరణం, కొన్నిచోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.గంటకు 30-50 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొన్నారు.

రెండు రోజులు వర్షాలు

సోమవారం మన్యం, అల్లూరి, పోలవరం, అనకాపల్లి, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. మంగళవారం మన్యం, అల్లూరి, పోలవరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రఖర్ జైన్ తెలిపారు.

కొప్పెరపాడులో అత్యధికo

ఆదివారం ప్రకాశం జిల్లా కొప్పెరపాడులో 42 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదు కాగా 41.6, నగరడోనలో 41.3, ఆళ్లగడ్డలో 41.1, తాడేపల్లిలో 40.9, మాకవరపాలెంలో 40.5, ధర్మాజీగూడెం, కడపలో 40.4,నందనమారెళ్లలో 40.1డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు పేర్కొన్నారు.

ఆ సమయంలో జాగ్రత్త

వర్షం పడే సమయంలో ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో ఉండకుండా సురక్షిత భవనాల్లో ఆశ్రయం పొందాలన్నారు. పాత భవనాలు, భారీ హోర్డింగ్స్ వద్ద నిలబడరాదని హెచ్చరించారు. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పొలాల్లో ఉన్న రైతులు, పశుకాపరులు మరింత అప్రమత్తంగా ఉండాలని, ఆకాశం మేఘావృతమై ఉరుములు వినిపించిన వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలన్నారు. చెట్ల క్రిందకు వెళ్లొద్దని విజ్ఞప్తి చేశారు.

Next Story