పున్నమి వెన్నెలలో రాములోరి పెళ్లి: సీఎంకు టీటీడీ ఆహ్వానం

by Vemula.Srinu Prasad |

కడప జిల్లా ఒంటిమిట్ట కోదండరామాలయంలో జరగనున్న శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు, సీతారాముల కల్యాణ మహోత్సవానికి రాష్ట్రం సిద్ధమవుతోంది. ..

పున్నమి వెన్నెలలో రాములోరి పెళ్లి:  సీఎంకు టీటీడీ ఆహ్వానం
X

దిశ, కడప: కడప జిల్లా ఒంటిమిట్ట కోదండరామాలయంలో జరగనున్న శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు, సీతారాముల కల్యాణ మహోత్సవానికి రాష్ట్రం సిద్ధమవుతోంది. ఏప్రిల్‌ 1న అత్యంత వైభవంగా నిర్వహించనున్న ఈ కల్యాణ వేడుకకు విచ్చేయాల్సిందిగా రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) అధికారికంగా ఆహ్వానించింది.​

రాజ్ భవన్‌లో గవర్నర్‌కు ఆహ్వానం​

విజయవాడలోని గవర్నర్ బంగ్లాలో టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు కల్యాణోత్సవ ఆహ్వాన పత్రికను అందజేసి, శాలువాతో ఘనంగా సన్మానించారు. అనంతరం వేద పండితులు ఆశీర్వచనాలు అందించి, శ్రీవారి ప్రసాదాలను అందజేశారు.

సీఎం స్వగృహంలో వేదాశీర్వచనం

అమరావతి ముఖ్యమంత్రి నివాసంలో సీఎం నారా చంద్రబాబు నాయుడిని అదనపు ఈవో బృందం కలిసింది. కల్యాణానికి రావాల్సిందిగా కోరుతూ ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా టీటీడీ వేద పండితులు ముఖ్యమంత్రికి వేదాశీర్వచనం చేశారు. అధికారులు శాలువాతో సీఎంను సన్మానించి, తీర్థ ప్రసాదాలు సమర్పించారు.

ఒంటిమిట్ట కల్యాణం ప్రత్యేకం

రాష్ట్ర పండుగగా ప్రభుత్వం నిర్వహిస్తున్న ఒంటిమిట్ట కోదండరామ స్వామి కల్యాణం దేశంలోనే ప్రత్యేకమైంది. శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల్లో భాగంగా పున్నమి వెన్నెలలో జరిగే ఈ కల్యాణాన్ని తిలకించేందుకు రాష్ట్రం నలుమూలల నుండి భక్తులు భారీగా తరలివస్తారు. ​ఈ ఆహ్వాన కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ శివప్రసాద్‌తో పాటు ఇతర టీటీడీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Next Story