సీఎం చంద్రబాబుపై స్కిల్ డెవలప్మెంట్ కేస్ క్లోజ్

by Thanuru Gopichand |   (  Updated:2026-01-13 02:51:11  IST  )

టీడీపీ శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

సీఎం చంద్రబాబుపై స్కిల్ డెవలప్మెంట్ కేస్ క్లోజ్
X

దిశ, వెబ్ డెస్క్ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై (Chandra Babu Naidu) గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నమోదైన స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో (Skill Development Case) కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసును విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం అధికారికంగా క్లోజ్ చేసింది. ఈ కేసులో ఆరోపణలకు సంబంధించి ఎటువంటి ఆధారాలు లేవని సీఐడీ పేర్కొంది. ఇది పూర్తిగా 'మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్' (Mistake of Fact) అని సీఐడీ సమర్పించిన తుది నివేదికను కోర్టు ఆమోదించింది. ఈ క్రమంలోనే చంద్రబాబు నాయుడు సహా ఈ కేసులో నిందితులుగా ఉన్న మొత్తం 37 మందికి న్యాయస్థానం క్లీన్ చిట్ ఇస్తూ విముక్తి కల్పించింది. 2023లో సెప్టెంబర్ 9న ఈ కేసులోనే చంద్రబాబును అరెస్టు చేయగా, ఆయన సుమారు 53 రోజుల పాటు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా ఏసీబీ కోర్టు వెలువరించిన ఈ తీర్పుతో చంద్రబాబుకు ఈ కేసు నుంచి పూర్తి ఉపశమనం లభించింది.

​యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు సీమెన్స్ సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందంలో సుమారు రూ. 371 కోట్ల అవకతవకలు జరిగాయన్న ఆరోపణలతో ఈ కేసు నమోదు చేయబడింది. అయితే ఈ కేసుకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) కూడా ఇప్పటికే జరిపిన విచారణలో చంద్రబాబుకు వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాలు లభించలేదని స్పష్టం చేసింది. సీఐడీ దర్యాప్తులో కూడా అవినీతి జరిగినట్లు ప్రాథమిక ఆధారాలు లభ్యం కాలేదని నివేదించడంతో ఏసీబీ కోర్టు ఈ కీలక నిర్ణయం తీసుకుంది. సోమవారం వెలువడిన ఈ తీర్పు రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. ఎట్టకేలకు ఈ కేసు ముగియడంతో తెలుగుదేశం పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

Next Story