కానుమోలులో 45.8 డిగ్రీల టెంపరేచర్.. 235 మండ‌లాలకు బిగ్ అలర్ట్

by Vemula.Srinu Prasad |

ప్ర‌చండ భానుడు నిప్పులు చెరుగుతున్నాడు. గ‌డిచిన నాలుగు రోజులుగా 44 నుంచి 48.1 డిగ్రీల మేర గ‌రిష్ట ఉష్ణోగ్ర‌త‌లు న‌మోదు అవుతున్నాయి. ఈక్ర‌మంలో జ‌నం బ‌య‌ట‌కు రావాలంటేనే బెంబేలెత్తుతున్నారు...

కానుమోలులో 45.8 డిగ్రీల టెంపరేచర్.. 235 మండ‌లాలకు బిగ్ అలర్ట్
X

దిశ‌, ఏపీ బ్యూరో: ప్ర‌చండ భానుడు నిప్పులు చెరుగుతున్నాడు. గ‌డిచిన నాలుగు రోజులుగా 44 నుంచి 48.1 డిగ్రీల మేర గ‌రిష్ట ఉష్ణోగ్ర‌త‌లు న‌మోదు అవుతున్నాయి. ఈక్ర‌మంలో జ‌నం బ‌య‌ట‌కు రావాలంటేనే బెంబేలెత్తుతున్నారు. శనివారం కృష్ణాజిల్లా కానుమోలులో 45.8 డిగ్రీల అత్య‌ధిక ఉష్ణోగ్ర‌త న‌మోదు కాగా అనకాపల్లి జిల్లా మాకవరపాలెంలో 45.5 డిగ్రీలు నమోదైంది. 13 జిల్లాల పరిధిలోని 95 మండలాల్లో 42 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి.

అప్ర‌మ‌త్తంగా ఉండండి

మ‌రో నాలుగు రోజులు ఎండ‌ల తీవ్ర‌త కొన‌సాగ‌నున్న‌ట్లు విప‌త్తుల నిర్వ‌హ‌ణ సంస్థ ఎండీ ప్ర‌ఖ‌ర్ జైన్ తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. ఆదివారం 21 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 214 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉందని తెలిపారు. ఆదివారం ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 45 - 46 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని ప్రఖర్ జైన్ వెల్లడించారు. మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, కాకినాడ, అనకాపల్లి,కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 42- 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 40 - 42 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందన్నారు.

సెగ భ‌గ‌లు..

శనివారం కృష్ణాజిల్లా కానుమోలు 45.8, అనకాపల్లి(జి) మాకవరపాలెంలో 45.5 అత్య‌ధిక ఉష్ణోగ్ర‌తలు న‌మోదు అయ్యాయి. ఏలూరు జిల్లా కుక్కునూరు, పోలవరం జిల్లా కూనవరం, పల్నాడు జిల్లా శ్రీనగర్ 45,ఎన్టీఆర్ జిల్లా తొర్రగుడిపాడులో 44.6, తూర్పుగోదావరి జిల్లా చిట్యాలలో 44.3, విశాఖ రూరల్లో 42.8, అల్లూరి జిల్లా రామరాజుపాలెం, కాకినాడ జిల్లా కోటనందూరులో 42.6, మార్కాపురం జిల్లా నందనామారెళ్లలో 42.5, ప్రకాశం(జి) కొండపిలో 42.4, గుంటూరు జిల్లా రాయపడి 42.3డిగ్రీల చొప్పున గరిష్ఠ ఉష్ణోగ్రతలు న‌మోదు అయ్యాయి.

ద్రోణి ప్ర‌భావంతో ఆ జిల్లాల్లో వ‌ర్షాలు

మరోవైపు ఛత్తీస్‌గఢ్, ఒడిశా మీదుగా ఉత్తరాంధ్ర వరకు ద్రోణి కొనసాగుతోందని ప్రఖర్ జైన్ పేర్కొన్నారు. దీని ప్రభావంతో నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్ కడప, అన్నమయ్య అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మన్యం, అల్లురి జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఉరుములతో వర్షం పడేటప్పుడు పొలాల్లో పనిచేసే రైతులు, పశుకాపరులు చెట్ల క్రింద నిలబడరాదని వెంటనే సురక్షిత భవనాల్లోకి వెళ్లాలని సూచించారు.

Next Story