‘ఆ విషయంలో కౌలు రైతులను ఇబ్బందులకు గురి చేయొద్దు’.. అధికారులకు మంత్రి కీలక ఆదేశాలు

by Jakkula.Mamatha |

ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రభుత్వం(AP Government) అనేక కార్యక్రమాలు చేపడుతోందని, వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని అధికారులను మంత్రి దుర్గేష్(Minister Kandula Durgesh) ఆదేశించారు.

‘ఆ విషయంలో కౌలు రైతులను ఇబ్బందులకు గురి చేయొద్దు’.. అధికారులకు మంత్రి కీలక ఆదేశాలు
X

దిశ,వెబ్‌డెస్క్: ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రభుత్వం(AP Government) అనేక కార్యక్రమాలు చేపడుతోందని, వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని అధికారులను మంత్రి దుర్గేష్(Minister Kandula Durgesh) ఆదేశించారు. గుంటూరు జిల్లాలో నేడు(మంగళవారం) ఉదయం 11 గంటలకు కలెక్టరేట్ లోని ఎస్.ఆర్.శంకరన్ సమావేశ మందిరంలో జిల్లా సమీక్ష కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ.. ప్రభుత్వ సంక్షేమ గణంకాలను ఎమ్మెల్యేలకు తెలపడం ద్వారా ప్రభుత్వం ప్రజలకు ఎంత సంక్షేమం అందిస్తుందో తెలుస్తుందన్నారు. ఈ అంశంలో అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులతో సమన్వయము చేసుకోవాలని సూచించారు. రెవిన్యూ, వ్యవసాయ శాఖ, బ్యాంకర్లు సమన్వయంతో వ్యవహరించాలని మంత్రి దుర్గేష్ ఆదేశించారు.

కౌలు రైతుల రక్షణ కోసం కూటమి ప్రభుత్వం పని చేస్తుందన్నారు. త్వరలోనే ప్రభుత్వం కౌలు రైతుల కోసం కొత్త చట్టం తెస్తుందన్నారు. కౌలు రైతులకు సీసీఆర్సీ కార్డులు, రుణాల విషయంలో బ్యాంకర్లు కౌలు రైతులను ఇబ్బందులకు గురి చేయవద్దన్నారు. మార్చి 15 లోగా సంబంధిత సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు. దుగ్గిరాల శుభం కోల్డ్ స్టోరేజ్ వల్ల ధాన్యం నష్టపోయిన రైతాంగానికి నష్టపరిహారం, ప్రత్తి పంటకు మద్దతు ధరపై చర్చిస్తున్నామన్నారు. మినీ గోకులాలు, పశు ఆరోగ్య శిబిరాల పై మంత్రి మాట్లాడారు. గుంటూరు ఛానల్ విస్తరణ, కాలువల ఆధునీకరణ తద్వారా వ్యవసాయ రంగంలో అదనపు నీటి సౌకర్యం అంశం పై మంత్రి అధికారులతో చర్చించారు. నిరుద్యోగ యువతకు కూటమి ప్రభుత్వం తెచ్చిన నూతన ఇండస్ట్రియల్ పాలసీ పై అవగాహన కల్పించాలన్నారు.

మన బడి- మన భవిష్యత్ లో జరుగుతున్న పనుల పురోగతిని మంత్రి దుర్గేష్ అడిగి తెలుసుకున్నారు. పీఎంఏవై క్రింద రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి నెలలో అందించే గృహాల వివరాలను మంత్రి అడిగి తెలుసుకున్నారు.. త్వరితగతిన ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసి అర్హులైన లబ్ధిదారులకు అందించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలపై మంత్రి దుర్గేష్ ఆరా తీశారు. జిల్లాలో గుంతల రహిత రోడ్ల స్థితిగతులపై మంత్రి దుర్గేష్ అధికారులను ఆరా తీశారు. జిల్లాలో 335 కి. మీ రోడ్లు(65శాతం) మేర ప్యాచ్ వర్క్ పూర్తి అయిందని ఫిబ్రవరి 15 నాటికి మిగతా పనులు పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు. గడిచిన ఐదేళ్లలో తట్టెడు మట్టి వేయలేదని మంత్రి విమర్శించారు. కొత్త రోడ్లు వేయాలంటే అవసరం అయిన నిధుల కోసం కృషి చేస్తామన్నారు.

Next Story