గత వైసీపీ ప్రభుత్వంపై మండిపడిన మంత్రి

by Thanuru Gopichand |

శ్రీవారి దర్శనానికి వెళ్లే సమయంలో అన్యమతస్థులు ఇచ్చే డిక్లరేషన్ విషయంలోనూ జగన్ రెడ్డి మొండిగా వ్యవహరించారని కొల్లు రవీంద్ర విమర్శించారు.

గత వైసీపీ ప్రభుత్వంపై మండిపడిన మంత్రి
X

దిశ, వెబ్ డెస్క్ : గత వైసీపీ (YCP) ప్రభుత్వ హయాంలో తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం (Tirumala Laddu Prasadam) తయారీలో వాడే నెయ్యిని కల్తీ చేయడం ద్వారా కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీశారని మంత్రి కొల్లు రవీంద్ర (kollu Ravindra) మండిపడ్డారు. అనకాపల్లిలో జరిగిన మీడియా సమావేశంలో రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర (Minister Kollu Ravindra) మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచుకోవడమే కాకుండా, పవిత్రమైన దేవదేవుడి ప్రసాదాన్ని కూడా వదల్లేదని ధ్వజమెత్తారు. దర్యాప్తు సంస్థలు కల్తీ జరిగినట్లు స్పష్టమైన ఆధారాలతో నివేదికలు సమర్పించినా వైసీపీ నేతలు సిగ్గులేకుండా బుకాయిస్తున్నారని మంత్రి విమర్శించారు.

ప్రమాదకర రసాయనాలతో నెయ్యి

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏర్పాటైన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT) నివేదికలోని అంశాలను మంత్రి ఈ సందర్భంగా ప్రస్తావించారు. 2019 నుంచి 2024 మధ్య కాలంలో సుమారు 60 లక్షల కిలోల నెయ్యిని భోలే బాబా, వైష్ణవి వంటి సంస్థలు సరఫరా చేశాయన్నారు. అయితే అందులో అసలు నెయ్యే లేదని దర్యాప్తులో తేలిందని వెల్లడించారు. సెంట్రల్ ఫుడ్ టెక్నలాజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (CFTRI) నివేదిక ప్రకారం.. పామాయిల్, లాక్టిక్ యాసిడ్, మోనో లాక్టిక్ యాసిడ్ వంటి ప్రమాదకర రసాయనాలను కలిపి కృత్రిమ నెయ్యిని తయారు చేసి పంపిణీ చేసినట్లు పరిశోధనలో స్పష్టమైందని ఆయన తెలిపారు. కేవలం స్వార్థ ప్రయోజనాల కోసం టెండర్ నిబంధనలను సవరించారన్నారు. అనర్హులైన సంస్థలకు కాంట్రాక్టులు కట్టబెట్టారని విమర్శించారు.

హవాలా మార్గంలో నగదు బదిలీ

ఈ భారీ కుంభకోణంలో అప్పటి టీటీడీ ఉన్నతాధికారులు, పాలకవర్గ సభ్యుల పాత్రపై కూడా మంత్రి ఘాటుగా స్పందించారు. అప్పటి ఈవో అనిల్ కుమార్ సింఘాల్, అదనపు ఈవో ధర్మారెడ్డి, చైర్మన్ పీఏలు ప్రధాన కారకులుగా నివేదికలో ఉన్నారని పేర్కొన్నారు. కిలో నెయ్యికి రూ.25 చొప్పున కమీషన్లు వసూలు చేశారన్నారు. హవాలా మార్గంలో కూడా నగదు బదిలీ జరిగిందని ఆధారాలు ఉన్నాయని వివరించారు. ఈ మొత్తం ప్రక్రియలో జగన్ రెడ్డి అండదండలు ఉన్నాయని ఆరోపించారు. హిందూ ధర్మంపై గౌరవం లేని వ్యక్తులు వ్యవస్థలను నాశనం చేశారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో రామతీర్థం, అంతర్వేది, విజయవాడ దుర్గమ్మ గుడి వంటి చోట్ల జరిగిన అపచారాలను ఆయన గుర్తు చేశారు.

డిక్లరేషన్ విషయంలో మొండితనం

శ్రీవారి దర్శనానికి వెళ్లే సమయంలో అన్యమతస్థులు ఇచ్చే డిక్లరేషన్ విషయంలోనూ జగన్ రెడ్డి మొండిగా వ్యవహరించారని కొల్లు రవీంద్ర విమర్శించారు. మాజీ రాష్ట్రపతులు, ప్రధానులు కూడా పాటించిన నిబంధనలను జగన్ ధిక్కరించడం ఆయన అహంకారానికి నిదర్శనమని అన్నారు. ఇప్పుడు తప్పు దొరికిపోయినా సోషల్ మీడియా ద్వారా తప్పుడు ప్రచారాలు చేస్తూ భక్తులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. తిరుమలకు మద్యం సీసాలు తీసుకురావడం వంటి చర్యల వెనుక వైసీపీ నేతల కుట్రలు ఉన్నాయని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.

చట్టం నుంచి తప్పించుకోలేరు

చివరగా దేవుడి విషయంలో ఆటలాడుకున్న వారు ఎవరైనా సరే చట్టం నుంచి తప్పించుకోలేరని మంత్రి హెచ్చరించారు. ఈ కల్తీ కుట్రలో భాగస్వాములైన ప్రతి ఒక్కరిపై కఠిన చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. తిరుమల తిరుపతి దేవస్థానంతో పాటు రాష్ట్రంలోని అన్ని ఆలయాల పవిత్రతను కాపాడటానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. భక్తుల మనోభావాలను గౌరవిస్తూ, దోషులను బోనులో నిలబెట్టే వరకు విశ్రమించబోమని కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు.

Next Story