రాష్ట్రంలో నిప్పుల కొలిమి: 210 మండలాలకు బిగ్ అలర్ట్

by Vemula.Srinu Prasad |

రాష్ట్రంలో ఎండల తీవ్రత గరిష్ఠ స్థాయికి చేరుకుంది...తిరుపతి జిల్లా వరదయ్యపాలెంలో 44.4°C, ప్రకాశం జిల్లా కొప్పెరపాడులో 44.1°C అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

రాష్ట్రంలో నిప్పుల కొలిమి: 210 మండలాలకు బిగ్ అలర్ట్
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో ఎండల తీవ్రత గరిష్ఠ స్థాయికి చేరుకుంది. తిరుపతి జిల్లా వరదయ్యపాలెంలో 44.4°C, ప్రకాశం జిల్లా కొప్పెరపాడులో 44.1°C అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. భానుడి భగభగలకు తోడు ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతుండటంతో జనం విలవిలలాడుతున్నారు. రానున్న రెండు రోజులు కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.

76 మండలాల్లో తీవ్ర వడగాలులు..

గురువారం నాడు రాష్ట్రంలోని 76 మండలాల్లో తీవ్ర వడగాలులు, మరో 134 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు తెలిపారు. ప్రధానంగా ఉత్తర కోస్తా జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి వంటి ప్రాంతాల్లో ఎండ ప్రభావం ఎక్కువగా ఉండనుంది. అలాగే శుక్రవారం కూడా 51 మండలాల్లో తీవ్ర వడగాలులు, 94 మండలాల్లో సాధారణ వడగాలులు వీచే సూచనలు ఉన్నాయని అధికారులు వెల్లడించారు.

ఏజెన్సీ ప్రాంతాల్లోనూ..

ముఖ్యంగా గురువారం శ్రీకాకుళంలో 19, విజయనగరంలో 21, అనకాపల్లిలో 15 మండలాలతో పాటు మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో తీవ్రమైన ఎండలు ఉంటాయని అంచనా వేస్తున్నారు. తీర ప్రాంతాలు, ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా ఉష్ణోగ్రతలు పెరగనుండటంతో యంత్రాంగం అప్రమత్తమైంది.

ఎండల తీవ్రత దృష్ట్యా..

ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని అధికారులు సూచించారు. వృద్ధులు, గర్భిణీలు, చిన్నారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉండటానికి తగినన్ని నీళ్లు, మజ్జిగ, ఓఆర్ఎస్ ద్రావణం వంటివి తీసుకోవాలని హెచ్చరించారు.

Next Story