హనీ ట్రాప్ కలకలం.. మహిళను ఎరగా వేసి రూ. 10 లక్షల దోపిడీ

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-04-22 12:38:58  IST  )

అనంతపురం జిల్లాలో కొంతకాలంగా గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న 'హనీ ట్రాప్ దందా వెలుగులోకి రావడం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. అమాయక వ్యాపారవేత్తలు, ప్రముఖులను టార్గెట్ చేస్తూ మహిళలను ఎరగా వేసి ఈ ముఠా లక్షలాది రూపాయలు దోచుకుంటోంది. ..

హనీ ట్రాప్ కలకలం.. మహిళను ఎరగా వేసి రూ. 10 లక్షల దోపిడీ
X

దిశ, వెబ్ డెస్క్: అనంతపురం జిల్లా(Anantapur District)లో కొంతకాలంగా గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న 'హనీ ట్రాప్'(Honey Trap) దందా వెలుగులోకి రావడం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. అమాయక వ్యాపారవేత్తలు, ప్రముఖులను టార్గెట్ చేస్తూ మహిళలను ఎరగా వేసి ఈ ముఠా లక్షలాది రూపాయలు దోచుకుంటోంది. ఈ ముఠా సభ్యులు అత్యంత పథకం ప్రకారం నేరాలకు పాల్పడుతున్నారు. మొదట పని ఉందంటూ లేదా ఇతర కారణాలతో మహిళలను బాధితుల వద్దకు పంపిస్తారు. వారు ఏకాంతంగా మాట్లాడుతున్న సమయంలో ముఠా సభ్యులు ఒక్కసారిగా దాడి చేస్తారు. అనంతరం బాధితులను భయభ్రాంతులకు గురిచేసి, భారీ మొత్తంలో నగదు డిమాండ్ చేస్తారు. ఒకవేళ డబ్బు ఇవ్వడానికి నిరాకరిస్తే మహిళలతో రేప్ కేసు పెట్టిస్తామని బెదిరిస్తూ అందినకాడికి దండుకుంటున్నారు.

ప్రధాన బాధితులు వీరే..

ఇటీవల వెలుగులోకి వచ్చిన ఘటనల్లో ఈ ముఠా దారుణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారిని ట్రాప్ చేసి ఏకంగా రూ. 10 లక్షలు వసూలు చేశారు. ఓ జ్యోతిష్యుడిని బురిడీ కొట్టించి ఆయన వద్ద నుంచి రూ. 5 లక్షలు లాగేశారు. వీరితో పాటు మరికొందరు బాధితులు పరువు పోతుందన్న భయంతో బయటకు చెప్పుకోలేకపోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వ్యవహారానికి సంబంధించిన ఆడియో టేపులు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.

పోలీసుల చర్యలు - సీఐపై వేటు

బాధితులు ధైర్యం చేసి అనంతపురం ఎస్పీ జగదీష్‌కు ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. అయితే, ఈ హనీ ట్రాప్ కేసు దర్యాప్తులో రాప్తాడు సీఐ హర్ష తీవ్ర నిర్లక్ష్యం వహించారని ఉన్నతాధికారులు గుర్తించారు. బాధితుల ఫిర్యాదులపై సరైన రీతిలో స్పందించనందుకు గానూ, ఆయనను వీఆర్ (Vacation Reserve) కు పంపిస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఈ ముఠా వెనుక ఉన్న కీలక సూత్రధారుల కోసం పోలీసులు వేట కొనసాగిస్తున్నారు. సామాన్యులు, వ్యాపారవేత్తలు అపరిచిత మహిళల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

భర్త‌ను చంపేందుకు ప్రియుడితో పక్కా స్కెచ్: తీరా చూస్తే.. సీన్ అంతా రివర్స్

Next Story