మద్యం స్కాం కేసులో ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు

by Thanuru Gopichand |   (  Updated:2026-01-19 03:32:07  IST  )

కీలక పరిణామంతో రాజకీయ వర్గాల్లో చర్చ.

మద్యం స్కాం కేసులో ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
X

దిశ, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన సుమారు 3,500 కోట్ల రూపాయల మద్యం స్కాం (Liquor Scam) కేసులో వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి (Mithun Reddy) ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) గట్టి షాక్ ఇచ్చింది. ఈ కేసుకు సంబంధించి మనీలాండరింగ్ కోణంలో దర్యాప్తును వేగవంతం చేసిన ఈడీ ఈ నెల 23వ తేదీన తమ ముందు విచారణకు హాజరు కావాలంటూ ఆయనకు నోటీసులు జారీ చేసింది. 2019 నుంచి 2024 మధ్య కాలంలో అప్పటి వైసీపీ ప్రభుత్వం అనుసరించిన మద్యం విధానంలో భారీగా అవకతవకలు జరిగాయని, సిండికేట్లకు లబ్ధి చేకూర్చి పెద్ద ఎత్తున ముడుపులు వసూలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ కుంభకోణంలో మిథున్ రెడ్డి కీలక పాత్ర పోషించారని, నిధుల మళ్లింపులో ఆయనకు సంబంధం ఉందని ఈడీ అనుమానిస్తోంది. గతంలోనే ఇదే కేసులో ఏపీ సిట్ (SIT) అధికారులు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయగా, ఆయన సుమారు 71 రోజుల పాటు జైలులో ఉండి సెప్టెంబర్ 2025లో బెయిల్‌పై విడుదలయ్యారు. తాజాగా ఇదే కేసులో మాజీ ఎంపీ విజయసాయి రెడ్డికి కూడా ఈ నెల 22న విచారణకు రావాలని నోటీసులు అందడం గమనార్హం. ప్రస్తుతం మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు అందడం ఏపీ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది.

Next Story