వైభవోపేతంగా తిరుపతమ్మ అమ్మవారి రంగుల మహోత్సవం

by Thanuru Gopichand |

దేవతామూర్తుల దర్శనానికి తరలివచ్చిన భక్త జనం.

వైభవోపేతంగా తిరుపతమ్మ అమ్మవారి రంగుల మహోత్సవం
X

దిశ, వెబ్ డెస్క్ : ఎన్టీఆర్ జిల్లాలోని పెనుగంచిప్రోలులో (Penuganchiprolu) కొలువుదీరిన శ్రీ తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానంలో (Sri Tirupatamma Ammavari Devasthanam) రంగుల మహోత్సవాన్ని (Rangula Mahotsavam) నిర్వహించారు. సోమవారం తెల్లవారుజామున ప్రారంభమైన ఈ మహోత్సవం ఆద్యంతం వైభవోపేతంగా సాగింది. గొపయ్యస్వామి సమేత తిరుపతమ్మ అమ్మవారిని ప్రత్యేక పల్లకిలో ఊరేగించారు. పెనుగంచిప్రోలు నుంచి జగ్గయ్యపేటకు (Jagayyapeta) ప్రధాన దేవతామూర్తులతో పాటు సహ దేవతామూర్తులను కూడా తరలించారు. ఉదయం 6.10 నిమిషాలకు ప్రత్యేక పూజలను నిర్వహించి ఊరేగింపును ప్రారంభించారు. ఇందుకోసం రెండువారాల నుంచే సన్నాహక కార్యక్రమాలను దేవస్థాన అధికారులు నిర్వహించారు. పెనుగంచిప్రోలు రంగుల మండపం నుంచి జగ్గయ్యపేట రంగుల మండపం వరకు ఎద్దుల బండ్లపై దేవతామూర్తులను తీసుకెళ్లేందుకు పెనుగంచిప్రోలు గ్రామస్తులకు అవకాశం కల్పించారు. లాటరీ ద్వారా భక్తులను ఎంపిక చేశారు. ప్రతి రెండేళ్లకు ఒకసారి రంగుల మహోత్సవం జరుగుతుందని అధికారులు తెలిపారు. ఈ ఏడాది కూడా ఎక్కడా లోటుపాట్లు లేకుండా భక్తి శ్రద్ధలతో అమ్మవారి రంగుల మహోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ ఉత్సవాన్ని తిలకించేందుకు భక్తులు వేలాదిగా తరలివచ్చారు. గోపయ్యస్వామి సమేత తిరుపతమ్మ అమ్మవారిని దర్శించుకొని తరించారు.

Next Story