- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
క్రీడాకారులకు గుడ్ న్యూస్.. రాష్ట్రంలో 7 సింథటిక్ ట్రాక్‌ల నిర్మాణం
కాకినాడను స్పోర్ట్స్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది...

దిశ, వెబ్ డెస్క్: కాకినాడ(Kakinada)ను స్పోర్ట్స్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం(coalition government) కృషి చేస్తోంది. ఇందులో భాగంగా కాకినాడ జిల్లా క్రీడాప్రాధికార సంస్థ, జేఎన్టీయూకే స్టేడియాలను శాప్ ఛైర్మన్ రవినాయుడు(Shaap Chairman Ravinaidu) సందర్శించారు. క్రీడాభివృద్ధి పనులతోపాటు డీఎస్ఏ ఇండోర్ స్టేడియాలు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంతర్జాతీయ క్రీడా సదుపాయాల కల్పనకు కాకినాడ అత్యంత అనుకూలమని చెప్పారు. వచ్చే ఏడాదికి రాష్ట్రంలో 7 సింథటిక్ ట్రాక్ లను నిర్మించడమే ధ్యేయమన్నారు. త్వరితగతిన జేఎన్టీయూకేలో క్రీడాభివృద్ధి పనులు పూర్తి చేయాలని అధికారులకు సూచించామని తెలిపారు. జేఎన్టీయూకే వేదికగా అంతర్జాతీయస్థాయి ప్రమాణాలతో క్రీడాసదుపాయాలు కల్పిస్తామని రవి నాయుడు స్పష్టం చేశారు.
క్రీడలకు అధిక ప్రాధాన్యత
‘‘కూటమి ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యతనిస్తుంది. కాకినాడ జగన్నాధపురంలో రూ.9.84 కోట్లతో క్రీడావికాస కేంద్రం ఏర్పాటుకు ఆమోదం తెలిపాం. జిల్లాలో 1.81 కోట్లతో లింగంపర్తి, 1.07 కోట్లతో పెద్దాపురం, రూ.76,80 లక్షలతో పిఠాపురం, రూ.71.50 లక్షలతో జగ్గంపేట ప్రాంతాల్లో కేవీకేల నిర్మాణాలకు ఉత్తర్వులు జారీ చేశాం. కాకినాడ వేదికగా 16 ఎకరాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో క్రీడాసదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నాం. కేంద్రం సహకారంతో కాకినాడలో స్పోర్ట్స్ ఎక్సలెన్స్ సెంటర్ ఏర్పాటు చేయనున్నాం. జేఎన్టీయూకేలో సింథటిక్ ట్రాక్ ను త్వరలోనే వినియోగంలోకి తీసుకొస్తాం. దేశంలోనే అత్యుత్తమంగా ఏపీ స్పోర్ట్స్ పాలసీని రూపొందించి అమలు చేస్తున్నాం. రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి ఖేలో ఇండియా ద్వారా రూ.74 కోట్లు కేంద్రం మంజూరు చేసింది.’’ అని శాప్ చైర్మన్ రవి నాయుడు తెలిపారు.
ఆ సమయంలో క్రీడలకు గ్రహణం
‘‘వైసీపీ హయాంలో క్రీడలకు గ్రహణం పట్టింది. కేవీకేలు, అకాడమీలను నిర్వీర్యం చేసిన దౌర్భాగ్యుడు జగన్. పతకాలు సాధించిన క్రీడాకారుల ప్రోత్సాహకాలను సైతం నిలిపేసిన ఘనత వైసీపీది. కాకినాడ, విశాఖ, తిరుపతిలో అకాడమీల స్థాపనకు చర్యలు తీసుకుంటున్నాం. క్రీడాకోటా కింద ప్రభుత్వ ఉద్యోగాల్లో 3శాతం రిజర్వేషన్లను అమలు చేస్తున్న ఘనత రాష్ట్ర ప్రభుత్వానిది. క్రీడాకారులకు ఉద్యోగ భద్రత, క్రీడాప్రోత్సాహకాలు, క్రీడా సదుపాయాలు కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. నకిలీ సర్టిఫికెట్ల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదు. జగన్ పెట్టిన రూ.16 కోట్ల క్రీడాప్రోత్సాహకాల బకాయిలను కూటమి ప్రభుత్వం విడుదల చేసింది. ఏపీ క్రీడాకారులను అంతర్జాతీయ క్రీడాకారులుగా తయారు చేయడమే సీఎం చంద్రబాబునాయుడు లక్ష్యం.’’ అని రవి నాయుడు పేర్కొన్నారు.






