- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వైరల్ అవుతున్న ‘బెంతాహై’ జగన్: ఈ కొత్త పేరు వెనుక అసలు కథ ఇదే!
ఏపీ రాజకీయాల్లో కొత్త ట్రెండ్ నడుస్తోంది. సోషల్ మీడియాలో వైఎస్ జగన్ కొత్త పేరు ‘బెంతాహై జగన్’ అవుతోంది.

దిశ, ఏపీ బ్యూరో: మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు జగన్ కొత్త పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. ఆయనకు తాజాగా వచ్చిన పేరు బెంతాహై జగన్. ఆయన ఇంటిపేరు వైఎస్‌కు బదులు బెంతాహై జగన్ అనే పేరు వైరల్ అవుతోంది. దీంతో వైసీపీ అభిమానులు, కార్యకర్తలు ఈ బెంతాహై ఏమిటా అని ఆరా తీస్తున్నారు. ‘బెంతాహై’ అంటే.. బెంగళూరు, తాడేపల్లి, హైదరాబాద్. బెంగళూరులోని మొదటి అక్షరం బెం, తాడేపల్లిలోని మొదటి అక్షరం తా, హైదరాబాద్‌లోని మొదటి అక్షరం హైలను కలిపి బెంతాహై అంటున్నారు. జగన్ ఇటీవల ఏపీ రాజధాని అమరావతికి ప్రత్యామ్నాయంగా ప్రకటించిన మావిగన్ పేరు మాదిరిగా ఇది ఉంది. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరులో మొదటి అక్షరాలతో మావిగన్ అని పేరు పెట్టి ఈ మూడు ప్రాంతాలను క్యాపిటల్ కారిడార్‌గా డెవలప్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి జగన్ సలహా ఇచ్చారు. అప్పటి నుండి ఏపీలో రెండు మూడు ఊళ్లను కలిపి వాటి మొదటి అక్షరాలతో కలిపి పిలవడం ట్రెండింగ్‌గా మారింది.
హైదరాబాద్‌కు మకాం మార్పు..
తాజాగా జగన్ హైదరాబాద్ కు మకాం మార్చ నున్నారన్న వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. వైసీపీ వ్యతిరేక మీడియాతో పాటు ఆపార్టీ అనుకూల ముద్ర వేసుకున్న పత్రికలు, చానల్స్ లో కూడా జగన్ హైదరాబాద్ కు మకాం మారుస్తారన్న వార్తలు విస్తృతంగా ప్రసారమయ్యాయి. ఇకపై జగన్ వీకెండ్స్ లో బెంగళూరుతో పాటు హైదరాబాద్ లో కూడా ఉంటారని ప్రచారం జరిగింది. ఈ ప్రచారం పీక్స్ లో ఉన్నప్పుడే హైదరాబాద్ జూబ్లిహిల్స్ లోని లోటస్ పాండ్ లో జగన్ ఇంటిని సిద్ధం చేస్తున్న సమాచారం మీడియాలో వైరల్ అయింది. దీంతో యాంటీ వైసీపీ మీడియా, సోషల్ మీడియాలో బెంతాహై జగన్ అనే పేరుతో వార్తలు, చర్చలు జరుగుతున్నాయి. ఇక నుండి జగన్ తాడేపల్లి తో పాటు బెంగళూరు, హైదరాబాద్‌లలో కూడా రాజకీయ కార్యక్రమాలు నిర్వహించనున్నారంటూ కథనాలు వెలువడ్డాయి.
వైసీపీ అభిమానుల సంతోషం..
తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రభుత్వాధినేత రేవంత్ రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు శిష్యుడనే ముద్ర ఉంది. అలాగే తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావుతో జగన్ కు మంచి స్నేహం ఉందన్న సంగతి తెలిసిందే. దీంతో జగన్ హైదరాబాదులో ఉండటంవల్ల అధికార, ప్రతిపక్ష పార్టీలలో జరగబోయే మార్పులు పరిణామాలపై కూడా మీడియాలో ఇప్పటికీ డిబేట్స్ నడుస్తున్నాయి. వైసిపి నాయకులు, అభిమానులు మాత్రం జగన్ హైదరాబాద్ కు మారనున్నారన్న వార్తలను స్వాగతిస్తున్నారు. వైసిపి ముఖ్యనేతల్లో ఎక్కువమంది హైదరాబాదులోనే ఉంటున్నారు. దీంతో వారందరూ జగన్ తో సమావేశమయ్యేందుకు, పార్టీకి సంబంధించిన కీలక నిర్ణయాలను అంశాలను అధినేతతో చర్చించటానికి సమయం లభిస్తుందని అభిప్రాయపడుతున్నారు. బెంగళూరు లో జగన్ ఉండడం వల్ల పార్టీ నేతలకు రెండు రోజులు పాటు దూరంగా ఉంటున్నారని అభిప్రాయం కలుగుతుందని, అదే హైదరాబాదులో ఉండడం వల్ల జగన్ తో పార్టీ నేతలు తరచూ కలిసే అవకాశం లభిస్తుందని భావిస్తున్నారు. పైగా టీడీపీ జగన్ బెంగళూరు ప్రయాణాలపై చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టటానికి అవకాశం ఉంటుందని వైసిపి వర్గాలు భావిస్తున్నాయి.
లోటస్ పాండ్.. ఓ సెంటిమెంట్..
కూటమిలోని ముఖ్యనేతలైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ , విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ వారంలో రెండు రోజులు పాటు హైదరాబాదులోనే ఉంటున్నారని అందువల్ల జగన్ హైదరాబాదులో ఉన్నప్పటికీ టిడిపి, జనసేన, బిజెపి నాయకులు విమర్శించే అవకాశం లేదని వైసిపి వర్గాలు భావిస్తున్నాయి. పైగా 2019 ఎన్నికలకు ముందు జగన్ హైదరాబాద్లోని లోటస్ పాండ్ ఇంటి నుండే తన పాదయాత్ర ప్రారంభించారని, పార్టీ ఆవిర్భావ ప్రకటనను సైతం లోటస్ పాండ్ ఇంటి నుండే ప్రకటించారని వైసీపీ నేతలు గుర్తు చేసుకుంటున్నారు. లోటస్ పాండ్ లోని జగన్ ఇంటిని ఆ పార్టీ నాయకులు సెంటిమెంట్ గా కూడా భావిస్తున్నారు. తెలంగాణలోనూ, ప్రధానంగా హైదరాబాద్ లోనే ఉన్న లక్షలాదిమంది జగన్ అభిమానులు సైతం హైదరాబాద్ లోని ఇంటికి జగన్ రావాలని కోరుకుంటున్నారని ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి.






