పవన్ కల్యాణ్ దృష్టికి సమస్య.. ఒక్క ఫోన్‌తో ఇద్దరి ప్రాబ్లమ్ సాల్వ్

by Gantepaka Srikanth |

‘పవన్ సర్.. మా ఊరికి రోడ్డు వేయండి’ అంటూ విద్యార్థులు సామాజిక మాధ్యమాల ద్వారా పంపిన సందేశం ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ను కదిలించింది.

పవన్ కల్యాణ్ దృష్టికి సమస్య.. ఒక్క ఫోన్‌తో ఇద్దరి ప్రాబ్లమ్ సాల్వ్
X

దిశ, వెబ్‌డెస్క్: ‘పవన్ సర్.. మా ఊరికి రోడ్డు వేయండి’ అంటూ విద్యార్థులు సామాజిక మాధ్యమాల ద్వారా పంపిన సందేశం ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌(Pawan Kalyan)ను కదిలించింది. బురద రోడ్డులో ప్రతి రోజూ స్కూలుకు వెళ్లడానికి వారు పడుతున్న ఇబ్బందులు, వారి ఆవేదన చూసి చలించిపోయారు. తక్షణమే అధికారులతో వివరాలు తెప్పించుకుని రోడ్డు మంజూరు చేయించారు.

జిల్లా కలెక్టర్‌‌కు ఆదేశాలు

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, కొండాపురం మండల పరిధిలోని గజ్జలవారిపల్లి గ్రామానికి చెందిన పాఠశాల విద్యార్థులు రోడ్డు లేక స్కూలుకు వెళ్లేందుకు తాము పడుతున్న ఇబ్బందులు చెప్పుకుంటూ సోషల్ మీడియాలో వీడియోలు పెట్టారు. అధికారులు విషయాన్ని పవన్ కల్యాణ్ దృష్టికి వచ్చారు. దీంతో వెంటనే స్పందించిన పవన్ కల్యాణ్ ఆ జిల్లా కలెక్టర్‌తో మాట్లాడారు. అంచనాలు రూపొందించి తక్షణం రోడ్డు మంజూరు చేయాలని ఆదేశించారు. 1.6 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి రూ.86 లక్షలతో అంచనాలతో శాంక్షన్ ఆర్డర్ వచ్చింది. ఈ రోడ్డు నిర్మాణం పూర్తయితే గజ్జలవారిపల్లె నుంచి నిత్యం స్కూళ్లకి వెళ్లే విద్యార్థులు, పంట పొలాలకి వెళ్లే రైతుల వెతలు తీరనున్నాయి.

రూ.55 కోట్లతో రోడ్లు

కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఉదయగిరి నియోజకవర్గం పరిధిలో ఇప్పటికే పల్లెపండగ 1.0, పల్లెపండగ 2.0తో పాటు సాస్కీ నిధులతో సుమారు రూ.55 కోట్ల విలువజేసే రోడ్లు అభివృద్ధి చేశారు. నెల్లూరు జిల్లా పరిధిలో ఆ నియోజకవర్గంలో మొత్తం 641 రోడ్లు నిర్మాణం చేపట్టారు. పల్లెపండగ 1.0లో రూ. 26.6 కోట్లతో 437 రోడ్ల పనులు, 2.0లో 200 రోడ్ల పనులు నిర్మాణం చేపట్టారు. సాస్కీ నిధులతో మరో నాలుగు ప్రధాన రహదారుల నిర్మాణం చేపట్టనున్నారు. సాస్కీ నుంచి మొత్తం రూ. 9 కోట్లు వెచ్చించారు. ఈ నిధులతో దుత్తలూరు మండల పరిధిలోని డికేడీ రోడ్డు నుంచి కొత్తపేట మధ్య 6.5 కిలోమీటర్లు, కొండాపురం మండల పరిధిలో నేకునంపేట, ఇసుకపాలెం మధ్య 5.8 కిలోమీటర్లు, సీతారాంపురం మండల పరిధిలో కేయూఎస్ రోడ్డు, దేవిశెట్టిపల్లి మధ్య, వింజమూరు మండల పరిధిలో రావిపాడు అప్రోచ్ రోడ్డుల నిర్మాణానికి అనుమతులు మంజూరయ్యాయి. శనివారం గజ్జలవారిపల్లి విద్యార్థుల అభ్యర్ధనతో ఉప ముఖ్యమంత్రి ఆదేశంతో ఈ రోడ్డును అదనంగా మంజూరు చేశారు.

Next Story