- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విశాఖ తీరంలో టెన్షన్ టెన్షన్..! గల్లంతైన మత్స్యకారుల కోసం రెండో రోజు వేట
విశాఖ సముద్రంలో గల్లంతైన ఆరుగురు మత్స్యకారుల కోసం రెండో రోజు నేవీ, కోస్ట్ గార్డ్ జాయింట్ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది.

దిశ, వెబ్‌డెస్క్: విశాఖ ఫిషింగ్ హార్బర్ నుంచి సముద్ర వేటకు వెళ్లి గల్లంతైన ఆరుగురు మత్స్యకారుల ఆచూకీ కోసం ఇవాళ రెండో రోజు కూడా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. ఇండియన్ నేవీతో పాటు కోస్ట్ గార్డ్ (Indian Coast Guard) సిబ్బంది సముద్ర గర్భంలో జల్లెడ పడుతున్నారు. నిన్న ఓ మత్స్యకారుడు సురక్షితంగా దొరకడంతో, మిగిలిన వారిపై ఆశలు సజీవంగా ఉన్నాయి. అయితే, విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ (Vizag Fishing Harbour) నుంచి ఈనెల 1న ఓ బోటులో మొత్తం ఏడుగురు మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లారు. అయితే, సముద్రంలో వాతావరణం అనుకూలించకపోవడం, బోటు ఇంజిన్ చెడిపోవడం వల్ల వారంతా గల్లంతయ్యారు. తీరంతో సంబంధాలు తెగిపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురై అధికారులను ఆశ్రయించారు.
ఒకరిని కాపాడిన వాణిజ్య నౌక..
సముద్రంలో ప్రాణాల కోసం కొట్టుమిట్టాడుతున్న మత్స్యకారులలో కారి చిన్నా అనే వ్యక్తిని నిన్న ఆ మార్గంలో వెళ్తున్న ఓ అంతర్జాతీయ వాణిజ్య నౌక సిబ్బంది గమనించి సురక్షితంగా రక్షించారు. ఇవాళ ఉదయం 10 గంటల ప్రాంతంలో కోస్ట్ గార్డ్ సిబ్బంది చిన్నాను రెస్క్యూ బోటు ద్వారా తిరిగి విశాఖ ఫిషింగ్ హార్బర్‌కు తీసుకురానున్నారు. ప్రస్తుతం అతడు చిన్నా క్షేమంగానే ఉన్నట్లుగా సమాచారం. ప్రస్తుతం సముద్రంలో ప్రాణాలతో బయటపడిన కారి చిన్నా ఇచ్చిన కీలక సమాచారం ఆధారంగానే నేవీ, కోస్ట్ గార్డ్ బృందాలు గాలింపు చర్యలను వేగవంతం చేశాయి. మరోవైపు తమ వారు సురక్షితంగా తిరిగి రావాలని మత్స్యకారుల కుటుంబ సభ్యులు, బంధువులు విశాఖ తీరంలో కళ్లల్లో ఒత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నారు.






