గుంటూరులో ఉద్రిక్తత.. అంబటికి నిరసన సెగ

by Ramesh Naini |   (  Updated:2026-01-31 13:52:51  IST  )

తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ ఆరోపణల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ వాతావరణం వేడెక్కింది.

గుంటూరులో ఉద్రిక్తత.. అంబటికి నిరసన సెగ
X

దిశ, డైనమిక్ బ్యూరో: తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ ఆరోపణల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. శనివారం గుంటూరు జిల్లాలో మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు పర్యటన సందర్భంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ‘పాప ప్రక్షాళన’ పేరుతో వైసీపీ తలపెట్టిన పూజా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వెళ్తున్న అంబటిని కూటమి నేతలు, కార్యకర్తలు అడ్డుకోవడంతో గోరంట్ల ప్రాంతం కాసేపు రణరంగాన్ని తలపించింది.

సీఎంపై అనుచిత వ్యాఖ్యలు..

తిరుమల లడ్డూ వ్యవహారంపై నిరసనగా, వైసీపీ పిలుపునిచ్చిన ఆలయాల్లో పూజా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు అంబటి రాంబాబు శనివారం గోరంట్లకు బయలుదేరారు. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ కూటమి కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. అంబటి వాహనం రాగానే రోడ్డుపై అడ్డుకున్నారు. పరిస్థితి చేయి దాటుతుండటంతో పోలీసులు రంగప్రవేశం చేసి చెదరగొట్టే ప్రయత్నం చేశారు. ఈ గందరగోళం మధ్య వాహనంలో ఉన్న అంబటి రాంబాబు తీవ్ర అసహనానికి గురయ్యారు. ఆవేశంతో ఊగిపోతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై దుర్భాషలాడటం, అనుచిత వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది. అంబటి ఈ ఘటనపై అంబటి రాంబాబు పోలీసుల తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ నిర్వీర్యమైందని, రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి పనిచేస్తోందని ఆరోపించారు. "ఇది ముమ్మాటికీ పక్కా ప్లాన్ ప్రకారం జరిగిన దాడి. కూటమి కార్యకర్తలు చేతుల్లో కర్రలు, రాడ్లు పట్టుకుని స్వైర విహారం చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారు? చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులు.. టీడీపీ ఫ్లెక్సీలకు కాపలా కాస్తున్నారు. చంద్రబాబు కావాలనే రాష్ట్రంలో అరాచక వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులు హేయం’ అని అంబటి మండిపడ్డారు.

Next Story