Aarogyasri services: ఆరోగ్యశ్రీ సేవల బంద్‌కు తాత్కాలిక విరామం!

by Ramesh Naini |

ఆంధ్రప్రదేశ్‌లో ఆరోగ్యశ్రీ (ఎన్టీఆర్ వైద్య సేవ) సేవల నిలిపివేత నిర్ణయానికి ప్రైవేట్ నెట్‌వర్క్ ఆసుపత్రుల యాజమాన్యాలు తాత్కాలికంగా విరామం ప్రకటించినట్లు తెలుస్తోంది.

Aarogyasri services: ఆరోగ్యశ్రీ సేవల బంద్‌కు తాత్కాలిక విరామం!
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లో ఆరోగ్యశ్రీ (ఎన్టీఆర్ వైద్య సేవ) సేవల నిలిపివేత నిర్ణయానికి ప్రైవేట్ నెట్‌వర్క్ ఆసుపత్రుల యాజమాన్యాలు తాత్కాలికంగా విరామం ప్రకటించినట్లు తెలుస్తోంది. పెండింగ్ బకాయిల చెల్లింపుపై ఆరోగ్యశ్రీ ట్రస్ట్ అడిషనల్ సీఈవో నుంచి రాతపూర్వక హామీ రావడంతో ఆసుపత్రులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. పది రోజుల్లో రూ. 1,000 కోట్ల బకాయిలను వడ్డీతో సహా చెల్లిస్తామని, అలాగే ప్రతి నెలా రూ. 150 కోట్ల నుంచి రూ. 170 కోట్లు విడుదల చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినట్లు సమాచారం. అంతేకాకుండా యూనివర్సల్ హెల్త్ కవరేజ్ (UHC) స్కీంపై ఒక కమిటీని ఏర్పాటు చేస్తామని, ఆ కమిటీ నివేదిక వచ్చిన తర్వాతే దాని అమలు ఉంటుందని స్పష్టం చేసింది.

కాగా, పేరుకుపోయిన సుమారు రూ. 3,000 కోట్ల బకాయిలను ప్రభుత్వం చెల్లించకపోవడంతో ఏప్రిల్ 1 నుంచి ప్రైవేటు ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ వైద్య సేవలను తాత్కాలికంగా నిలిపివేశాయి. పాత బకాయిల సంగతి తేల్చకుండా కొత్తగా ‘ఇన్సూరెన్స్ మోడల్’ అమలు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని ఆస్పత్రుల అసోసియేషన్ తీవ్రంగా వ్యతిరేకించింది. దీనికి తోడు పెరిగిన వైద్య, నిర్వహణ ఖర్చుల దృష్ట్యా 2017 నాటి పాత ప్యాకేజీ ధరలకు వైద్యం అందించలేమని స్పష్టం చేసింది. అయితే, తాజా ప్రభుత్వ హామీలతో సేవల బంద్‌కు తాత్కాలిక బ్రేక్ పడటంతో రోగులకు ఊరట లభించింది.

Next Story