అల్లూరి జిల్లాలో సింగిల్ డిజిట్‌కు పడిపోయిన ఉష్ణోగ్రతలు

by Thanuru Gopichand |

పాడేరు ఏజెన్సీలో వణికిస్తున్న చలి పులి.

అల్లూరి జిల్లాలో సింగిల్ డిజిట్‌కు పడిపోయిన ఉష్ణోగ్రతలు
X

దిశ, వెబ్ డెస్క్ : అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పాడేరు ఏజెన్సీ (Paderu Agency) ప్రాంతంలో చలి (Cold) పులి పంజా విసురుతోంది. గత కొద్ది రోజులుగా ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. దీంతో గిరిజన గ్రామాల ప్రజలు గజగజ వణికిపోతున్నారు. తెల్లవారుజామున దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. సూర్యడు వచ్చి గంటలు గడుస్తున్నా కూడా మంచు తెరలు తొలగడం లేదు. దీంతో ప్రజల ఇంటి నుంచి బయటకు రావాలంటే కూడా వణికిపోతున్నారు. కొందరు చలి నుంచి రక్షణ పొందేందుకు చలి మంటలు కాచుకుంటుంటే మరికొందరు ఇంటికే పరిమితమై చలి తగ్గాలని వేచి చూస్తున్నారు.

అయితే ఏజెన్సీలో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ కు పడిపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో పడిపోతుండడంతో ప్రజల్లో కొంత మేర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా నమోదైన ఉష్ణోగ్రతల వివరాల ప్రకారం జిల్లాలోని మినుమలూరులో 6 డిగ్రీలు, చింతపల్లిలో 6.5 డిగ్రీలు, అరకులో 7 డిగ్రీలు, పాడేరులో 8 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ సీజన్ లో రికార్డైన అత్యల్ప ఉష్ణోగ్రతలు ఇవేనని అధికారులుపేర్కొంటున్నారు. పడిపోతున్న ఉష్ణోగ్రతల కారణంగా మన్యం ప్రాంతాన్ని మంచు దుప్పటి కప్పేస్తోంది. గాలిలో తేమ శాతం పెరగడం వల్ల చలి తీవ్రంగా ఎక్కువగా అనిపిస్తోందని ప్రజలు చెబుతున్నారు.

అయితే ఈ విపరీతమైన చలి కారణంగా వృద్ధులు, చిన్నారులు అనారోగ్యం బారిన పడే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. పొగమంచు కారణంగా దృశ్యమానత (Visibility) తగ్గిపోవడంతో ఘాట్ రోడ్లపై ప్రయాణించే వాహనదారులు హెడ్ లైట్లు వేసుకుని నెమ్మదిగా వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు. మరోవైపు చలి తీవ్రత పెరుగుతున్నా పర్యాటకులు మాత్రం అరకు, లంబసింగి వంటి ప్రాంతాలకు భారీగా తరలివస్తున్నారు. రాబోయే రెండు మూడు రోజుల్లో చలి తీవ్రత ఇంకా పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.

Next Story