ఏ దేశం వెళ్లిన అత్యధిక తలసారి ఆదాయం సంపాదించేది తెలుగువారే : సీఎం

by Thanuru Gopichand |   (  Updated:2025-12-10 09:31:18  IST  )

ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు సాధిస్తున్న అసాధారణ విజయాలు ఆంధ్రప్రదేశ్ బ్రాండ్‌ను పెంచాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉద్ఘాటించారు.

ఏ దేశం వెళ్లిన అత్యధిక తలసారి ఆదాయం సంపాదించేది తెలుగువారే : సీఎం
X

దిశ, వెబ్ డెస్క్ : ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు సాధిస్తున్న అసాధారణ విజయాలు ఆంధ్రప్రదేశ్ బ్రాండ్‌ను పెంచాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉద్ఘాటించారు. ప్రపంచంలో ఏ దేశం వెళ్లినా ఎక్కువ తలసరి ఆదాయం సంపాదించే వ్యక్తులు తెలుగువారేన్నారు. సచివాలయంలో బుధవారం నిర్వహించిన సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడారు. ప్రపంచంలోని ఏ దేశంలోనైనా విదేశీ విద్య కోసం విదేశాలకు వెళ్లేవారిలో అధిక శాతం తెలుగువారే ఉంటారన్నారు. ప్రపంచం తెలుగువారి ప్రతిభను గుర్తించిందని, అది మన బ్రాండ్ అని ఆయన పేర్కొన్నారు. విశాఖ భాగస్వామ్య సదస్సు (Vishaka CII Summit) ద్వారా రాష్ట్ర బ్రాండ్‌ను తాము సరిదిద్దామని, ఈ సదస్సు ద్వారా 13.26 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, దీనివల్ల 16 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయని ప్రకటించడానికి తాను గర్వపడుతున్నానని తెలిపారు. ఇప్పటికే ఎస్ఐపీబీ (State Investment Promotion Board) ద్వారా రూ. 8.29 లక్షల కోట్ల పెట్టుబడులు గ్రౌండ్ అయ్యాయని వెల్లడించారు. దేశంలోనే అత్యధిక పారిశ్రామిక పార్కులు ఉన్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచిందని కేంద్ర ప్రభుత్వం సైతం పార్లమెంటులో ప్రస్తావించిందని గుర్తు చేశారు.

గణనీయమైన ఆర్థిక పురోగతి

​ఆర్థిక వృద్ధి విషయంలో రాష్ట్రం గణనీయమైన పురోగతి సాధిస్తోందని సీఎం వివరించారు. మొదటి ఏడాది 12.02 శాతం జీఎస్డీపీ వృద్ధి రేటు వచ్చిందని, రెండో త్రైమాసికానికి 11.28 శాతం వృద్ధి రేటు నమోదైందని తెలిపారు. ఇది కేంద్ర ప్రభుత్వ 8.7శాతం వృద్ధి రేటు కంటే చాలా ఎక్కువ అని చెప్పారు. ఈ ఏడాది 17 శాతం వృద్ధి రేటు లక్ష్యంగా పెట్టుకోగా, మొదటి త్రైమాసికానికి 40 నుంచి 42 శాతం, రెండో త్రైమాసికానికి 50 నుంచి 56 శాతం వృద్ధిని అంచనా వేస్తున్నామని తెలిపారు. పాలనలో జవాబుదారీతనం, పారదర్శకత ముఖ్యమని చెబుతూ శాఖలవారీగా ఎవరైనా సరిగ్గా పర్ఫామ్ చేయకుంటే బాగుండదన్నారు. అంతా రికార్డు అవుతూనే ఉంటుందని.. అటువంటి వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నాం అని హెచ్చరించారు. ప్రభుత్వ నిర్ణయాలు, పథకాలు, పాలసీలు అవసరమైతే సరళీకృతం చేసి, ప్రజలకు జవాబుదారీగా ఉంటూ నీతివంతమైన, సమర్థమైన పాలన అందిస్తామని పునరుద్ఘాటించారు.

​సాగునీటి నిర్వహణ.. భూగర్భ జలాల పెంపుపై ప్రత్యేక దృష్టి

​సాగునీటి నిర్వహణపై ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. సమైఖ్యాంధ్రలో తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాయలసీమలో నీటి సమస్యను దగ్గరగా చూశానని గుర్తు చేసుకున్నారు. అనంతపురంలో రైతులకు వేరుశనగ విత్తనాలకు కూడా ఖర్చు రావడం లేదని, దీంతో దేశంలోనే తొలిసారిగా ఇన్పుట్ సబ్సిడీని పరిచయం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. తక్కువ వర్షపాతం, ఎడారిగా మారే ప్రమాదం ఉన్న రాయదుర్గం వంటి ప్రాంతాల్లో పశువులకు గడ్డి, నీరు సరఫరా చేసిన సందర్భాలు ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ తర్వాత 944 టీఎంసీల నీరు అందుబాటులో ఉందని, రెండో పంటకు కూడా నీరిచ్చే పరిస్థితి ఉందని చెప్పారు. అన్నా హజారే ద్వారా ఇంకుడు గుంతలు, రాజేందర్ సింగ్ ద్వారా బ్రిడ్జ్ టు రివర్ చెక్ డ్యాంలు, సర్ఫేస్ ట్యాంకులు, అడవుల్లో కందకాల ద్వారా భూగర్భ జలాలను పెంచేందుకు అనేక ప్రయత్నాలు చేశామని తెలిపారు. తద్వారా గతంలో వేయి అడుగుల లోతులో ఉన్న నీరు ప్రస్తుతం 6.07 మీటర్ల ఎత్తులో ఉందని, తాను తీసుకొచ్చిన 'వోల్టా చట్టం' ద్వారా భూగర్భ జలాలను కాపాడే ప్రయత్నం చేశామని వివరించారు.

​విద్యుత్ రంగంలో సంస్కరణలు, భవిష్యత్తు లక్ష్యాలు

​విద్యుత్ రంగంలో రాష్ట్రం ఎదుర్కొంటున్న సవాళ్లను, వాటికి తీసుకుంటున్న పరిష్కారాలను సీఎం వివరించారు. గత ప్రభుత్వాల హయాంలో లక్షా పది వేల కోట్ల విద్యుత్ బకాయిలు పేరుకుపోయాయని, ఛార్జీలు 35 వేల కోట్లు పెంచారని, సోలార్ ఎనర్జీని వినియోగించుకోకుండా 9 వేల కోట్ల రూపాయలు చెల్లించారని విమర్శించారు. నేడు విద్యుత్ కొనుగోలు ధరలు యూనిట్‌కు 4.90 పైసలకు పెరిగినా, దాన్ని 4.80 పైసలకు తగ్గించాలనే లక్ష్యంతో ఉన్నామని తెలిపారు. విద్యుత్ ఛార్జీల పెంపును నిలువరించి, ఆ భారాన్ని ప్రజలపై పడకుండా చూస్తున్నామని, విద్యుత్ ఛార్జీలు పెంచబోము అని హామీ ఇచ్చారు. మైక్రోగ్రిడ్, సబ్ స్టేషన్ యాస్ యూనిట్, ప్రొడ్యూసర్ కమ్ కన్జ్యూమర్ విధానం వంటి సంస్కరణలు తీసుకొచ్చామని, జీరో ట్రాన్స్‌మిషన్ లాసెస్పై దృష్టి పెట్టామని చెప్పారు. అనుకున్న విధంగా జరిగితే ఐదేళ్లలో యూనిట్ ధర రూ. 4కు తగ్గుతుందని, ఆంధ్రప్రదేశ్ 'ప్రిఫర్డ్ డెస్టినేషన్'గా మారుతుందని నమ్మకం వ్యక్తం చేశారు. నాణ్యమైన విద్యుత్ సరఫరా కోసం క్వాలిటీ చెక్ చేసే వ్యవస్థను కూడా తెచ్చామని తెలిపారు.

​హెచ్‌ఆర్‌డి కేంద్రం, మూడు ఆర్థిక కేంద్రాల ఏర్పాటు

​మానవ వనరుల సామర్థ్యాన్ని పెంచడానికి త్వరలో గిగాలో హెచ్‌ఆర్‌డి సెంటర్ వస్తుందని, అక్కడ అత్యుత్తమ ప్రమాణాలతో శిక్షణ అందిస్తామని సీఎం ప్రకటించారు. ఐఏఎస్, ఐపీఎస్, గ్రూప్స్ వారికి అక్కడ శిక్షణ, మిగిలిన వారికి రీజనల్ సెంటర్లలో శిక్షణ అందేలా చూస్తామని తెలిపారు. రాష్ట్రంలో నిధులను సమర్థవంతంగా వినియోగించేందుకు మూడు ఆర్థిక కేంద్రాలను తయారు చేస్తున్నామని చెప్పారు. అవి: విశాఖపట్నం జోన్ (పాత తూర్పు గోదావరి నుంచి శ్రీకాకుళం వరకు), అమరావతి జోన్ (పశ్చిమ గోదావరి నుంచి ప్రకాశం వరకు), తిరుపతి జోన్ (నెల్లూరు నుంచి కర్నూలు వరకు) అని వివరించారు. ప్రస్తుతం ఐదు జోన్లలో ఇన్నోవేషన్ హబ్స్ ఏర్పాటు చేశామని, వీసీఐసీ, సీబీఐసీ, బెంగళూరు-హైదరాబాద్ కారిడార్ వంటి ఐదు కారిడార్లు ఉన్నాయని తెలిపారు. స్మార్ట్ సిటీ, డ్రోన్ సిటీ, క్వాంటం వ్యాలీ హబ్, గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ, ఏరోస్పేస్ సిటీ వంటి భవిష్యత్తు టెక్నాలజీలను అభివృద్ధి చేసేందుకు ప్రయత్నిస్తున్నామని, ఇందుకోసం ఫైల్స్ క్లియరెన్స్ వేగవంతం కావాలని అధికారులను ఆదేశించారు.

READ MORE .....

మీలో ఎలాంటి మార్పు రాలేదు.. మంత్రులపై సీఎం చంద్రబాబు అసహనం

Next Story