- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నేడు సుప్రీంకోర్టులో తెలుగు రాష్ట్రాల జల వివాదాల కేసు విచారణ
నది జలాల వివాదంలో తెలంగాణ vs ఆంధ్రప్రదేశ్.

దిశ, వెబ్ డెస్క్ : తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాలు మరోసారి దేశ అత్యున్నత న్యాయస్థానానికి చేరాయి. గోదావరి జలాలను కృష్ణా బేసిన్‌కు (Krishna Basin) మళ్లించే క్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన పోలవరం-నల్లమల సాగర్ (Polavaram Nallamalla Sagar) ప్రాజెక్టును సవాలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన రిట్ పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టులో కీలక విచారణ జరగనుంది. ఏపీ ప్రభుత్వం ఎటువంటి చట్టబద్ధమైన అనుమతులు లేకుండా.. బచావత్ అవార్డు నిబంధనలకు విరుద్ధంగా ఈ ప్రాజెక్టు పనులను చేపడుతోందని తెలంగాణ (Telangana) వాదిస్తోంది. ముఖ్యంగా పోలవరం నుంచి సుమారు 200 టీఎంసీల గోదావరి నీటిని కృష్ణా బేసిన్‌కు మళ్లించే ప్రయత్నాలు తమ రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీస్తాయని తెలంగాణ ప్రభుత్వం తన పిటిషన్‌లో పేర్కొంది. ఈ ప్రాజెక్టుపై కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ, గోదావరి నది యాజమాన్య బోర్డుకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడంతోపాటు పనులను తక్షణమే నిలిపివేసేలా స్టే ఇవ్వాలని తెలంగాణ కోరుతోంది.
ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ తన వాదనలను వినిపించనున్నారు. ఇందుకోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదివారం ముంబైలో సింఘ్వీతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. దాదాపు గంటకు పైగా జరిగిన ఈ సమావేశంలో ప్రాజెక్టు వల్ల తెలంగాణకు కలిగే నష్టం, అంతర్రాష్ట్ర ఒప్పందాల ఉల్లంఘనలపై న్యాయవాదికి పూర్తిస్థాయిలో వివరించారు.
మరోవైపు ఏపీ ప్రభుత్వం (Andhra Pradesh) ఇప్పటికే కేవియట్ దాఖలు చేస్తూ.. తెలంగాణ ప్రభుత్వం రాజకీయ ఉద్దేశంతోనే ఈ కేసు వేసిందని, రాష్ట్ర అభివృద్ధికి అడ్డుపడుతోందని కౌంటర్ ఇచ్చేందుకు సిద్ధమైంది. అటు కేంద్ర ప్రభుత్వం కూడా గత వారమే ఈ వివాదాల పరిష్కారం కోసం ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తూ నోటిఫికేషన్ జారీ చేసిన తరుణంలో సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పుపై ఉత్కంఠ నెలకొంది.






