నిప్పుల కొలిమిలా తెలుగు రాష్ట్రాలు.. రోహిణీ కార్తె నాటికి పరిస్థితేంటో!

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-05-03 11:49:29  IST  )

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. మే నెల ప్రారంభంలోనే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తుండటంతో జనం విలవిలలాడుతున్నారు.

నిప్పుల కొలిమిలా తెలుగు రాష్ట్రాలు.. రోహిణీ కార్తె నాటికి పరిస్థితేంటో!
X

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. మే నెల ప్రారంభంలోనే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తుండటంతో జనం విలవిలలాడుతున్నారు. ఏప్రిల్ ఆఖరివారంలోనే పగటి ఉష్ణోగ్రతలు పలు ప్రాంతాల్లో 45 నుంచి 46 డిగ్రీల మార్కును తాకడం భయాందోళన కలిగిస్తోంది.

రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు

ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా గూడూరులో ఇప్పటికే ఈ సీజన్‌లోనే అత్యధికంగా 45.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అటు పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో 45.2 డిగ్రీలు, మార్కాపురం పరిధిలో 45 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. తెలంగాణలోనూ పరిస్థితి ఇలానే ఉంది. హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇటీవలే నిజామాబాద్ జిల్లాలో రికార్డుస్థాయిలో 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది.

రోహిణి కార్తెపై ఆందోళన

సాధారణంగా మే నెలాఖరులో వచ్చే రోహిణి కార్తె సమయంలో ఎండలు తీవ్రంగా ఉంటాయి. రోహిణి కార్తెలో రోళ్లు పగిలే ఎండలు ఉంటాయి అన్న సామెత ఉండనే ఉంది. అయితే ఈ ఏడాది మే మొదటి వారంలోనే 46 డిగ్రీలకు చేరువగా ఉష్ణోగ్రతలు ఉండటంతో.. ఇక మే 25 నుంచి ప్రారంభమయ్యే రోహిణి కార్తె సమయంలో పరిస్థితి ఇంకెంత దారుణంగా ఉంటుందోనని సామాన్యులు బెంబేలెత్తిపోతున్నారు.

వర్షాలు పడినా ఉక్కపోతే..

ఉదయం 9 గంటల నుంచే ఎండ తీవ్రత మొదలై, మధ్యాహ్నం అయ్యేసరికి నిప్పుల కొలిమిని తలపిస్తోంది. వేడి గాలుల (వడగాల్పుల) ప్రభావంతో ప్రజలు మధ్యాహ్నం వేళ బయటకు రావాలంటేనే జంకుతున్నారు. ప్రధాన రహదారులన్నీ జనసంచారం లేక కర్ఫ్యూను తలపిస్తున్నాయి. అకాల వర్షాలు అక్కడక్కడా కురుస్తున్నప్పటికీ, అది కేవలం గాలిలో తేమను పెంచి ఉక్కపోతకు కారణమవుతోందే తప్ప ఎండ తీవ్రతను తగ్గించడం లేదు. రాగల రెండు వారాల్లో మరిన్ని ప్రాంతాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు మధ్యాహ్నం వేళ బయటకు రావొద్దని వైద్యులు సూచిస్తున్నారు. డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉండేలా ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలని కోరుతున్నారు.

తెలంగాణ వాసులకు బిగ్ రిలీఫ్.. ఈ జిల్లాలకు భారీ వర్షసూచన!

Next Story