తెలుగు కేవలం భాష కాదు.. మన జీవన విధానం

by Thanuru Gopichand |

ప్రపంచ తెలుగు మహాసభల్లో స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రసంగించారు.

తెలుగు కేవలం భాష కాదు.. మన జీవన విధానం
X

దిశ, వెబ్ డెస్క్ : గుంటూరులో జరుగుతున్న ప్రపంచ తెలుగు మహాసభల (Prapancha Telugu Maha Sabhalu) వేదికగా ఆంధ్రప్రదేశ్ ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు (Ayyannapatrudu) తెలుగు భాషా పరిరక్షణపై కీలక వ్యాఖ్యలు చేశారు. తెలుగు కేవలం ఒక భాష మాత్రమే కాదని, అది మన జీవన విధానమని ఆయన కుండ బద్ధలుగొట్టారు. మారుతున్న కాలంలో పల్లెల్లో సైతం తెలుగు సంప్రదాయాలు, భాష కనుమరుగుకావడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుత కాలంలో తల్లులు పిల్లలకు చందమామ పాటలు పాడి వినిపించడం మానేశారన్నారు. అందుకు బదులుగా సెల్ ఫోన్లకు అలవాటు చేసి అన్నం తినిపిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఇంగ్లీషు నేర్చుకోవడం అవసరమే కానీ, మాతృభాషను విస్మరించడం తగదని అభిప్రాయపడ్డారు. పిల్లలకు తెలుగు విశిష్టతను వివరించాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఆయన గుర్తుచేశారు.

​తెలుగు భాషా ఖ్యాతిని ఖండాంతరాలకు విస్తరింపజేసిన ఘనత స్వర్గీయ నందమూరి తారక రామారావుకే దక్కుతుందని స్పీకర్ కొనియాడారు. ఎటువంటి గ్రాఫిక్స్ టెక్నాలజీ అందుబాటులో లేని సమయంలోనే ఎన్టీఆర్ ఒకే సినిమాలో మూడు భిన్నమైన పాత్రలు పోషించారని గుర్తు చేశారు. తద్వారా తెలుగు వారి సత్తా చాటారని అన్నారు. కానీ నేటి సినిమాల్లో గ్రాఫిక్స్ తప్ప విషయం ఉండటం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. సంక్రాంతి, ఉగాది వంటి పండుగలకు పాత వైభవాన్ని తీసుకురావాలని తెలుగు ప్రజలకు పిలుపునిచ్చారు. తెలుగు భాషాభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై ఈ మహాసభల్లో లోతుగా చర్చించాలని కోరారు. ఒక స్పష్టమైన కార్యాచరణను రూపొందిస్తే, దానిని అసెంబ్లీలో తీర్మానంగా ప్రవేశపెట్టి అమలు చేయిస్తానని ఆయన హామీ ఇచ్చారు.

Next Story