ఈ అవకాశం అదృష్టంగా భావిస్తున్నా.. నమ్మకాన్ని నిలబెట్టుకుంటా: నారా లోకేశ్‌

by Vemula.Srinu Prasad |

తెలుగుదేశం పార్టీ అధిష్టానం తనకు ఇచ్చిన అవకాశాన్ని అదృష్టంగా భావిస్తున్నానని.. పార్టీ బలోపేతం కోసం శాయశక్తులా కష్టపడతానని, శక్తివంచన లేకుండా పనిచేస్తానని తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా ఎంపికైన నారా లోకేశ్‌ పేర్కొన్నారు..

ఈ అవకాశం అదృష్టంగా భావిస్తున్నా.. నమ్మకాన్ని నిలబెట్టుకుంటా:  నారా లోకేశ్‌
X

దిశ, ఏపీ బ్యూరో/ చంద్రగిరి: తెలుగుదేశం పార్టీ అధిష్టానం తనకు ఇచ్చిన అవకాశాన్ని అదృష్టంగా భావిస్తున్నానని.. పార్టీ బలోపేతం కోసం శాయశక్తులా కష్టపడతానని, శక్తివంచన లేకుండా పనిచేస్తానని తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా ఎంపికైన నారా లోకేశ్‌ పేర్కొన్నారు. చంద్రగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశంలో మంత్రి లోకేశ్‌ మాట్లాడుతూ ‘నాకు ఈ అవకాశం రావడానికి కారణమైన కార్యకర్తలందరికీ పేరుపేరునా కృతజ్జతలు. నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను’ అని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా ఎంపికైన యువనేత లోకేశ్‌ తొలిసారిగా తమ ప్రాంతానికి రావడంతో చంద్రగిరి నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు పూలమాలలతో ముంచెత్తారు. అనంతరం లోకేష్‌ మాట్లాడుతూ.. ‘ప్రత్యర్థులు బెదిరించినా భయపడకుండా తొడగొట్టి ఎన్నికల బరిలో నిలబడిన అంజిరెడ్డి తాత, ప్రాణం పోతున్నా ప్రత్యర్థి పేరు తన నోట పలకని తోట చంద్రయ్య, రక్తమోడుతున్నా పోలింగ్‌ బూతులో కూర్చున్న మంజులారెడ్డి నాకు స్పూర్తి. మీ అందరి త్యాగాల వల్లే 94శాతం సీట్లతో ఈరోజు మేమంతా ఇక్కడ కూర్చున్నాం.’ అని లోకేశ్‌ గుర్తు చేశారు.

తప్పు చేసినవారు తప్పించుకోలేరు..

‘ప్రజలు, కార్యకర్తలపై తప్పుడు కేసులు బనాయించి, ఇబ్బంది పెట్టిన వారిపై చర్యలుంటాయని పాదయాత్రలో చెప్పా, అదే ఇప్పుడు చేస్తున్నాం. మేం వారి మాదిరిగా రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలుచేయడం లేదు. అభంశుభం తెలియని అమర్నాథ్‌ గౌడ్, అబ్ధుల్‌ సలాం, తోట చంద్రయ్య వంటి వారిని నిర్ధాక్షిణ్యంగా పొట్టనబెట్టుకున్నారు. దోషులపై చట్టపరిధిలో చర్యలు తీసుకుంటున్నాం.

భక్తులపై దాడిచేసిన వారిపై చర్యలు..

మూడు రోజుల క్రితం దేవాలయానికి అడ్డుగా ఉన్న కారు తీయమని చెప్పినందుకు చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి మనుషులు భక్తులపై దాడిచేశారు. భక్తులపై దాడిచేస్తే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు. అటువంటి దుశ్చర్యకు పాల్పడేవారిని వదిలిపెట్టే ప్రసక్తిలేదు.

చంద్రగిరి అంటే మాకు ప్రత్యేక ప్రేమ..

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తన రాజకీయ జీవితాన్ని చంద్రగిరి నుంచే ప్రారంభించారు. యువగళం పాదయాత్రలో చంద్రగిరి నాకు టర్నింగ్‌ పాయింట్, ఈరోజు ఇక్కడే నా రాజకీయ పదోన్నతికి సంబంధించి శుభవార్త విన్నాను. అందుకే చంద్రగిరి మాకు అచ్చివచ్చిన నియోజకవర్గం.

టీడీపీలో కార్యకర్తే అధినేత..

తెలుగుదేశం పార్టీలో కార్యకర్తే అధినేత. ఇటీవల పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజున చంద్రబాబు పక్కన సామాన్య కార్యకర్తలు కూర్చున్నారు. కార్యకర్తల కోసం సుమారు రూ.150కోట్ల బీమా సొమ్ము వెచ్చించాం. గత ప్రభుత్వంలో కేడర్‌పై పెట్టిన తప్పుడు కేసులన్నీ ఎత్తేస్తాం. గతంలో పెండింగ్‌లో ఉన్న బిల్లులు చాలావరకు క్లియర్‌ చేశాం. మిగిలినవి కూడా త్వరలో విడుదల చేస్తాం. కార్యకర్తలను ఆర్థికంగా బలోపేతం చేసే బాధ్యత మేం తీసుకుంటాం.

కుటుంబంలో సమస్యలు సహజం..

కోటిమంది సభ్యులుగల అతిపెద్ద కుటుంబం తెలుగుదేశం. ఇంత పెద్ద కుటుంబంలో చిన్నచిన్న సమస్యలు సహజం. పార్టీలో సంస్కరణల కోసం ప్రత్యర్థులపై కంటే 5రెట్లు అధికంగా నేను పార్టీలో పోరాడాను. నమ్మిన సిద్ధాంతం కోసం కేడర్‌ కలసికట్టుగా కష్టపడి పనిచేయాలి. అలిగి ఇంట్లో పడుకుంటే నష్టపోయేది మనమే.

క్లస్టర్‌ ఇన్చార్జి, టిడిపి మండల అధ్యక్షుడికి పొలిట్‌ బ్యూరోలో చోటు..

అధునాతన టెక్నాలజీతో ప్రతి కార్యకర్త చేసే పనిని ట్రాక్‌ చేస్తున్నాం. పార్టీ కోసం పనిచేసే ప్రతి కార్యకర్తను మై టిడిపి యాప్‌ ద్వారా గుర్తించి, సముచిత స్థానం కల్పిస్తాం. తాజాగా ప్రకటించిన రాష్ట్ర కమిటీలో ఒక క్లస్టర్‌ ఇన్‌చార్జి, మండల పార్టీ అధ్యక్షుడిని పొలిట్‌బ్యూరోలోకి తీసుకున్నాం. ఎవరు ఏం చేస్తున్నారో శాస్త్రీయంగా తెలుసుకునేందుకే మైటిడిపి యాప్‌ ప్రవేశపెట్టాం.

చెవిలో పువ్వును జగనే నమ్మడం లేదు..

చంద్రగిరి చెవిలో పువ్వుగా పేరొందిన చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని జగనే నమ్మడం లేదు. ఆయన చేతివాటం జగన్‌కు అర్థమైంది. మద్యంలో 600 కోట్లు కొట్టేశాడు. దేవుడి లడ్డూలు, వస్త్రాలను సైతం అమ్ముకున్నాడు. అటువంటి అవినీతిపరుడి నుంచి చంద్రగిరి ప్రజలకు విముక్తి లభించింది. ఎమ్మెల్యే పులివర్తి నాని నియోజకవర్గంలో పనుల కోసం మా వెంట పడుతుంటాడు. గత 22నెలల్లో నియోజకవర్గంలో రూ.900 కోట్లతో పనులకు శ్రీకారం చుట్టారు. చంద్రగిరికి పరిశ్రమలు తెచ్చే బాధ్యత నాది. చిన్నచిన్న సమస్యలను పక్కనబెట్టి టిడిపి, జనసేన, బిజెపి కేడర్‌ కలసికట్టుగా ప్రత్యర్థులపై పోరాడాలి.

అభివృద్ధి–సంక్షేమంలో దూసుకెళ్తున్నాం

ఇండియా టుడే కాంక్లేవ్‌లో నేను మళ్లీ గెలుస్తామని చెబితే, పవనన్న ఫోన్‌ చేసి 3సార్లు వరుసగా గెలుస్తామని చెప్పాలని అన్నారు. దేశంలో ఏ రాష్ట్రానికి లేనివిధంగా అమరావతికి ప్రధాని మోదీ చట్టబద్ధత కల్పించారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్, పోలవరం ప్రాజెక్టుకు చేయూత అందిస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులున్నా అభివృద్ధి, సంక్షేమాలను జోడెడ్లబండిలా ముందుకు తీసుకెళ్తున్నాం. 150రోజుల్లో డిఎస్సీ నిర్వహించి 16వేల టీచర్‌ పోస్టులు భర్తీచేశాం. జాబ్‌ క్యాలెండర్‌ ప్రకారమే ఉద్యోగాలు భర్తీచేస్తాం. ప్రభుత్వం చేస్తున్న మంచిని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత కార్యకర్తలదే.’ అని యువనేత లోకేష్‌ పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో జిల్లా ఇన్‌ చార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్, చిత్తూరు పార్లమెంటు పార్టీ అధ్యక్షుడు షణ్ముఖరెడ్డి, జోనల్‌ ఇన్‌చార్జి రాంగోపాల్‌రెడ్డి, శాప్‌ చైర్మన్‌ రవినాయుడు, తుడా చైర్మన్‌ డాలర్‌ దివాకర్‌రెడ్డి పాల్గొన్నారు.

Next Story