స్కూల్ పిల్లలకు చెప్పుల దండ వేసిన టీచర్స్.. కన్నీటి పర్యంతమైన పేరెంట్స్

by Naga Rani Yarlagadda |

కృష్ణా జిల్లా ఉయ్యూరులోని విజయసాయి స్కూల్‌లో దారుణ ఘటన జరిగింది. క్రమశిక్షణ లేదంటూ విద్యార్థుల మెడలో చెప్పులదండ వేసి అవమానించారు.

స్కూల్ పిల్లలకు చెప్పుల దండ వేసిన టీచర్స్.. కన్నీటి పర్యంతమైన పేరెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్ : విద్య నేర్పించి పిల్లలను ప్రయోజకులుగా తీర్చిదిద్దాల్సిన గురువులు.. విచక్షణ మరిచారు. క్రమశిక్షణ నేర్పుతామంటూ అమానుషానికి ఒడిగట్టారు. కృష్ణా జిల్లా ఉయ్యూరులోని విజయసాయి స్కూల్‌లో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. చిన్నారి విద్యార్థులకు చెప్పుల దండ వేసి పాఠశాల ప్రాంగణంలో అవమానించడంపై తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

పాఠశాల విద్యార్థులు కొందరు క్రమశిక్షణ తప్పారని, అల్లరి చేస్తున్నారనే నెపంతో పాఠశాల ఉపాధ్యాయులు అత్యంత దారుణమైన శిక్షను ఎంచుకున్నారు. పిల్లలను మందలించడమో లేదా తల్లిదండ్రులకు చెప్పడమో చేయకుండా.. ఏకంగా విద్యార్థుల మెడలో చెప్పుల దండలు వేసి వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారు. తోటి విద్యార్థుల ముందు అలా ఉంచడంతో ఆ చిన్నారులు తీవ్ర మానసిక వేదనకు గురయ్యారు. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల వద్దకు చేరుకుని యాజమాన్యాన్ని నిలదీశారు. "ఫీజులు కట్టి చదివిస్తున్నది మా పిల్లలను సంస్కారవంతులుగా తీర్చిదిద్దడానికే కానీ, ఇలా అవమానించడానికి కాదు" అంటూ కన్నీటిపర్యంతమయ్యారు. ఉపాధ్యాయులపై కఠిన చర్యలు తీసుకోవాలని పాఠశాల ముందు ఆందోళనకు దిగారు.

Next Story