ఢిల్లీలో ఏపీ ఉపాధ్యాయుల గర్జన

by Vemula.Srinu Prasad |

ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద చిత్తూరు ఉపాధ్యాయులు భారీ ధర్నా నిర్వహించారు...

ఢిల్లీలో ఏపీ ఉపాధ్యాయుల గర్జన
X

దిశ, చిత్తూరు: 2010కి ముందు నియమితులైన ఉపాధ్యాయులకు కూడా టెట్ పరీక్ష తప్పనిసరి చేయాలన్న సుప్రీంకోర్టు తీర్పును నిరసిస్తూ గురువారం దేశ రాజధానిలోని జంతర్ మంతర్ వద్ద ఉపాధ్యాయులు భారీ ధర్నా నిర్వహించారు. ఏఐఎస్టీఎఫ్, ఏఐ జాక్టో ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా వేలాది మంది ఉపాధ్యాయులు పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి పెద్ద సంఖ్యలో ప్రతినిధులు తరలివచ్చారు. ధర్నాలో ఎస్టీయూ చిత్తూరు జిల్లా అధ్యక్షులు మదన్ మోహన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి షేక్ ఇలియాస్, రాష్ట్ర నాయకులు గంటా మోహన్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంపై పలు డిమాండ్లు ఉంచారు.

టెట్ అన్యాయం

25 ఏళ్లుగా సేవలు అందిస్తున్న ఉపాధ్యాయులను టెట్ రాయమనడం అన్యాయమని, వెంటనే విద్యా హక్కు చట్టాన్ని సవరించి మినహాయింపు ఇవ్వాలని కోరారు. సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి, పాత పెన్షన్ స్కీమ్‌ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. జాతీయ విద్యా విధానం ప్రకారం ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో తెలుగు మీడియంను కొనసాగించాలన్నారు. పాఠశాలల క్రమబద్ధీకరణ పేరుతో ఉపాధ్యాయ పోస్టులను తగ్గించే చర్యలను మానుకోవాలని హెచ్చరించారు. ఈ నిరసనలో చిత్తూరు జిల్లా నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన ఎస్టీయు కార్యకర్తలను రాష్ట్ర నాయకత్వం అభినందించింది. కార్యక్రమంలో నాయకులు జానకిరామ్, రఘుపతి, అశోక్ బాబు, రమేష్‌తో పాటు మహిళా కన్వీనర్లు ఝాన్సీ, శశికళ, నాగమణి, కుమారి తదితరులు పాల్గొన్నారు. పలు జాతీయ ఉపాధ్యాయ సంఘాలు ఈ పోరాటానికి తమ సంఘీభావాన్ని ప్రకటించాయి.

Next Story