టీడీపీ వర్సెస్ జనసేన.. పిఠాపురంలో మరోసారి బయటపడ్డ రచ్చ

by Ramesh Goud |   (  Updated:2025-04-05 15:21:55  IST  )

కాకినాడ జిల్లా పిఠాపురంలో తెలుగుదేశం జనసేన మధ్య రచ్చ మరోసారి బయటపడింది.

టీడీపీ వర్సెస్ జనసేన.. పిఠాపురంలో మరోసారి బయటపడ్డ రచ్చ
X

దిశ, పిఠాపురం : కాకినాడ జిల్లా పిఠాపురంలో తెలుగుదేశం జనసేన మధ్య రచ్చ మరోసారి బయటపడింది. నూతన ఎమ్మెల్సీగా ఎన్నికై వచ్చిన కొణిదల నాగబాబుకు పిఠాపురంలో చేదు అనుభవం ఎదురైంది. రెండు రోజులు పర్యటనలో భాగంగా పిఠాపురంలో ఎమ్మెల్సీ నాగబాబు విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో శనివారం పిఠాపురం మండలం కుమారపురంలో టీడీపీ జనసేన కార్యకర్తలు పోటాపోటీగా నినాదాలు చేసుకున్నారు. కుమారపురం గ్రామంలో రోడ్డు ప్రారంభోత్సవానికి వచ్చిన నాగబాబు ఎదుటే టీడీపీ కార్యకర్తలు జై వర్మ.. జై తెలుగుదేశం అంటూ నినాదాలు చేశారు.

దీంతో జనసేన కార్యకర్తలు కూడా, వారికి పోటీగా జై పవన్ కళ్యాణ్ .. జై నాగబాబు అంటూ నినాదాలు చేయడంతో ఇరు వర్గాల మధ్య పోటాపోటీ ఘర్షణ వాతావరణం నెలకొంది. పోలీసులు రెండు వర్గాలను వారించే ప్రయత్నం చేశారు. మొదటిరోజు గొల్లప్రోలు లోను నాగబాబు ఎదుటే టీడీపి కార్యకర్తలు నినాదాలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా రెండో రోజు పర్యటనలోను నాగబాబుకు ఈ తరహా అనుభవ ఎదురు కావడంతో టీడీపి కావాలనే జనసేన ను రెచ్చగొడుతుందని అంటున్నారు. ఇదిలా ఉండగా జనసేన కార్యకర్తలు , నాయకులు, టీడీపీని లెక్కచేయకుండా ఉండడం వల్లే ఇలా జరుగుతుందని మరికొందరు చెబుతున్నారు. ఏదేమైనా పిఠాపురంలో జనసేన వర్సెస్ టీడీపిగా పరిస్థితి మారింది.

Next Story
null