పార్లమెంట్‌లో మేము మాట్లాడబోయే అంశాలివే.. టీడీపీ ఎంపీ కీలక వ్యాఖ్యలు

by Ramesh Naini |

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఆదివారం అమరావతిలో తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించారు.

పార్లమెంట్‌లో మేము మాట్లాడబోయే అంశాలివే.. టీడీపీ ఎంపీ కీలక వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) అధ్యక్షతన ఆదివారం అమరావతిలో తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్లమెంట్‌ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ ఎంపీలకు ఆయన దిశానిర్దేశం నిర్దేశం చేశారు. సమావేశం అనంతరం టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మీడియాతో మాట్లాడుతూ.. ‘అత్యధిక సార్లు బడ్జెట్ ప్రవేశపెడుతున్న మహిళ ఆర్థిక మినిస్టర్ గా నిర్మల సీతారామన్ గారు నిలుస్తున్నారు, అలాగే ప్రపంచంలో మారుతున్న ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా మనదేశంలో ఈసారి ప్రవేశ పెట్టుకోవాల్సిన బడ్జెట్ కు ఆవశ్యకత నెలకొంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విషయానికొస్తే.. శ్రీకాకుళం నుంచి రాయలసీమ వరకు ఇరిగేషన్ ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వ పథకం ''పూర్వోదయం'' ద్వారా పూర్తిచేసే అంశం, రాయలసీమను హార్టికల్చర్ హబ్ గా మార్చేందుకు కేంద్రం నుంచి రూ.15 వేల కోట్లు పైగా నిధులు సాధించేలా, ప్రస్తుతం రాయలసీమలో ఉన్న ఎనిమిది లక్షల హెక్టార్లను 40 లక్షల హెక్టార్లకు వృద్ధి చేసేందుకు నిధులు రాబట్టే అంశం, పోలవరం ప్రాజెక్టు ఎలా అయితే పూర్తి చేసుకుంటున్నామో, అలాగే రాయలసీమలో నీళ్లు అందించేందుకు నల్లమల సాగర్ ప్రాజెక్టు అభివృద్ధికి నిధులు రాబట్టేందుకు కేంద్రం వద్ద కృషి చేయబోతున్నాం’ అని తెలిపారు.

తెలుగు రాష్ట్రాల్లో నదీ జలాల వాటా..

‘రాష్ట్రంలో లక్ష కోట్ల రూపాయలకు పైగా జరుగుతున్న జాతీయ రహదారులు, రైల్వే లైన్ల అభివృద్ధిని త్వరగా పరుగులు పెట్టించేందుకు పార్లమెంటులో మాట్లాడబోతున్నాం. ప్రజా రాజధాని అమరావతి బిల్లుకు సంబంధించి కేంద్రం వద్ద మాట్లాడబోతున్నాం, ఎందుకంటే, 33,000 ఎకరాలు రైతులు స్వచ్ఛందంగా రాజధాని నిర్మాణానికి ఇచ్చారు, కానీ 2019- 24 మధ్యలో రాజధాని విషయంపై గత ప్రభుత్వం తీరు వల్ల గందరగోళం నెలకొంది. ఈ కారణం వల్ల రాజధానిపై గెజిట్ తీసుకొస్తే, ఈ పరిస్థితులు తొలగిపోతాయి, ఇంకా రాష్ట్రంలో వ్యవస్థలు అభివృద్ధి చెందడానికి, పెట్టుబడులు రావడానికి వీలు కలుగుతుంది. అలాగే తెలుగు రాష్ట్రాల్లో నదీ జలాల వాటా అంశంపై కేంద్రం వద్ద చర్చించబోతున్నాం’ అని స్పష్టం చేశారు.

పార్లమెంట్ సమావేశాలు..

కాగా ఈ నెల 28 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి 1న కేంద్రం బడ్జెట్ ప్రవేశ పెట్టనుంది. ఈ బడ్జెట్‌లో ఏపీ(Ap)కి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని ఏపీ కోరుతోంది. ఆయా శాఖల నుంచి రావాల్సిన నిధులు విడుదల చేయాలని విజ్ఞప్తి చేస్తోంది. ఈ నేపథ్యంలో టీడీపీ ఎంపీలకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.

Next Story