- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎమ్మెల్యే దగ్గుపాటి వ్యవహారంపై TDP అధిష్టానం ఫోకస్!
వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతున్న అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే.

దిశ, వెబ్ డెస్క్ : అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ (Daggubati Prasad) వ్యవహారశైలి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో (TDP) తీవ్ర చర్చనీయాంశమైంది. ఎమ్మెల్యే అనుచరులు నియోజకవర్గంలో సాగిస్తున్న అక్రమాలు, దౌర్జన్యాలపై స్థానిక నేతలు పార్టీ కేంద్ర కార్యాలయంలో ఫిర్యాదు చేయడంతో టీడీపీ అధిష్టానం ఈ వ్యవహారంపై ఆరా తీస్తోంది. తాజాగా అనంతపురంలో ఏర్పాటు చేసిన ఒక ఎగ్జిబిషన్ లో నిర్వాహకుడు ఫకృద్దీన్‌ను ఎమ్మెల్యే అనుచరుడు గంగారాం, గన్‌మెన్ షేక్ షావలి బెదిరించి, రూ.10 లక్షలు డిమాండ్ చేశారనే ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు అందడం, ఎమ్మెల్యే గన్‌మెన్‌ను జిల్లా ఎస్పీ సస్పెండ్ చేయడం పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించేలా ఉందని అధిష్టానం భావిస్తోంది.
గతంలో కూడా దగ్గుబాటి ప్రసాద్ పలు వివాదాల్లో చిక్కుకున్నారు. ముఖ్యంగా టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్, ఆయన తల్లిపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఒక ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ కావడం అప్పట్లో పెద్ద దుమారాన్నే లేపింది. 'వార్ 2' సినిమా విడుదలకు సంబంధించి ఎన్టీఆర్ అభిమానుల పట్ల ఎమ్మెల్యే కఠినంగా వ్యవహరించడం, ఆయన వ్యాఖ్యలపై ఆగ్రహించిన అభిమానులు ఎమ్మెల్యే కార్యాలయం వద్ద నిరసనలు తెలపడం వంటి పరిణామాలు పార్టీకి తలనొప్పిగా మారాయి. ఆ సమయంలోనే సీఎం చంద్రబాబు నాయుడు ఆయనను పిలిపించి మందలించినప్పటికీ, వరుసగా తలెత్తుతున్న కొత్త వివాదాలు పార్టీలో అసహనానికి దారితీస్తున్నాయి.
అనంతపురం నియోజకవర్గంలోని సీనియర్ నేతలను కాదని అధిష్టానం ప్రసాద్‌కు అవకాశం ఇచ్చినప్పటికీ, ఆయన వర్గపోరును ప్రోత్సహిస్తున్నారని సొంత పార్టీ నేతలే ఆరోపిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి వర్గానికి, ప్రసాద్ వర్గానికి మధ్య నెలకొన్న విభేదాలు, అలాగే ఎమ్మెల్యే అనుచరుల భూదందాలు, బెదిరింపుల పర్వంపై నివేదికలు పార్టీ కార్యాలయానికి చేరుతున్నాయని భోగట్టా. ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేలా ప్రవర్తిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించబోమని ఇప్పటికే అధిష్టానం సంకేతాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలో అనంతపురంలోని తాజా పరిణామాలపై పార్టీ విచారణ కమిటీ వేసి సమగ్ర నివేదిక కోరినట్లు సమాచారం.






