దారుణంగా కొట్టుకున్న టీడీపీ-జనసేన శ్రేణులు.. ఎందుకంటే?

by Ramesh Naini |

అనకాపల్లి జిల్లా బుచ్చయ్యపేట మండలం పెదమదిన గ్రామంలో టీడీపీ, జనసేన పార్టీల శ్రేణుల మధ్య తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది.

దారుణంగా కొట్టుకున్న టీడీపీ-జనసేన శ్రేణులు.. ఎందుకంటే?
X

దిశ, డైనమిక్ బ్యూరో : అనకాపల్లి జిల్లా బుచ్చయ్యపేట మండలం పెదమదిన గ్రామంలో టీడీపీ, జనసేన పార్టీల శ్రేణుల మధ్య తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఎన్నికలకు ముందు కూటమిగా ఏర్పడి కలిసి పోటీ చేసి విజయం సాధించిన ఈ రెండు పార్టీల మధ్య క్షేత్రస్థాయిలో చిన్న విషయాలకే గొడవలు జరుగుతున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా గ్రామంలోని ప్రభుత్వ స్థలంలో టీడీపీ వర్గీయులు చెట్లు నరికివేయడాన్ని జనసేన వర్గం తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఈ విషయమై ఇరు వర్గాల మధ్య మాటల తూటాలు పేలగా, పరిస్థితి అదుపు తప్పి కొట్లాటకు దారితీసింది. సమస్య తీవ్రతను గుర్తించిన బుచ్చయ్యపేట ఎమ్మార్వో ఇరు వర్గాలతో గ్రామసభ ఏర్పాటు చేశారు.

అయితే, గ్రామసభలోనూ వివాదం చల్లారకపోవడంతో ఒక్కసారిగా ఇరువర్గాలు రాళ్లు, కర్రలతో ఒకరిపై మరొకరు దాడులకు దిగాయి. ఈ ఘర్షణలో పలువురికి గాయాలైనట్టు సమాచారం. పోలీసుల సమక్షంలోనే ఈ దాడులు జరగడం స్థానికంగా కలకలం రేపింది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు జోక్యం చేసుకుని ఇరు వర్గాలను చెదరగొట్టారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు పెంచినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై అధికారుల విచారణ కొనసాగుతోంది.

Next Story