- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎస్ఐ ఛాంబర్‌లో చెప్పుతో దాడి చేసిన మహిళ.. షాకైన పోలీసులు (వీడియో)
చట్టాన్ని కాపాడడానికే పోలీసులు ఉన్నది. మరి ఆ పోలీస్ ఎదుటే, పోలీస్ స్టేషన్‌లోనే దాడి జరిగితే.. అధికారంలో ఉన్నాం కదా అని ఏది పడితే అది చేస్తే.. అది అరాచకమే అవుతుంది.

దిశ, వెబ్‌డెస్క్ : చట్టాన్ని కాపాడడానికే పోలీసులు ఉన్నది. మరి ఆ పోలీస్ ఎదుటే, పోలీస్ స్టేషన్‌లోనే దాడి జరిగితే.. అధికారంలో ఉన్నాం కదా అని ఏది పడితే అది చేస్తే.. అది అరాచకమే అవుతుంది. ఏపీలో టీడీపీ జిల్లా అధ్యక్షురాలు హద్దులు మీరి ప్రవర్తించి రచ్చకెక్కింది. పోలీస్ స్టేషన్‌లోనే ఎస్ఐ ఛాంబర్‌లో ఉన్న ఓ వ్యక్తిపై చెప్పుతో దాడి చేసింది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. విశాఖ పట్నంలో జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
అనకాపల్లికి చెందిన కొత్తూరు నరేంద్ర వైసీపీ నాయకుడు. ఆయన అక్కిరెడ్డిపాలెంలో ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్నాడు. ఈ క్రమంలో స్థానికంగా ఉన్న వారికి ఆర్టీసీలో ఉద్యోగాలు ఇప్పిస్తానని పలువురు నిరుద్యోగుల నుంచి దాదాపు రూ.40 లక్షల వరకు వసూలు చేశాడనే ఆరోపణలు ఉన్నాయి. ఈ మోసంపై గాజువాక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదులు సైతం చేశారు. ఈ కేసులో భాగంగా కొత్తూరు నరేంద్రను పోలీసులు స్టేషన్‌కు పిలిపించారు. ఈ సమాచారం అందుకున్న టీడీపీ జిల్లా మహిళ అధ్యక్షురాలు సర్వసిద్ధి అనంతలక్ష్మి పోలీస్ స్టేషన్‌కు వచ్చింది. నేరుగా ఎస్ఐ ఛాంబర్‌కు వెళ్లి అక్కడ కూర్చున్న నరేంద్రను చెప్పుతో కొట్టింది. ఈ హఠాత్ పరిణామంతో అటు ఎస్ఐ, ఇటు నరేంద్ర షాక్‌కు గురయ్యారు.
వెంటనే ఎస్ఐ తేరుకోని అనంతలక్ష్మిని అడ్డుకున్నాడు. స్టేషన్‌లోనే పోలీసుల అదుపులో ఉన్న వ్యక్తిపై దాడి చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. మహిళా కానిస్టేబుళ్లు వచ్చి అనంతలక్ష్మిని బయటకు తీసుకెళ్లారు. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న సీఐ పార్థసారధి టీడీపీ జిల్లా అధ్యక్షురాలు అనంతలక్ష్మిపై కేసు నమోదు చేశారు. అయితే అధికార పార్టీలో ఉన్న తనపై కేసు నమోదు చేస్తారా అంటూ అనంతలక్ష్మి సీఐపైనా చిందులు తొక్కారు. వెంటనే నిన్ను ఈ స్టేషన్ నుంచి ట్రాన్స్‌ఫర్ చేయిస్తానని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు స్టేషన్‌లో అనంతలక్ష్మి దాడి చేసిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మరి టీడీపీ అధిష్టానం ఈ ఘటనపై ఎలా స్పందిస్తుందో చూడాలి.






