Telangana TDP: తెలంగాణలో పునరాగమనం! వచ్చే ఎన్నికల్లో పోటీకి టీడీపీ సన్నద్ధం ?

by Thanuru Gopichand |   (  Updated:2025-06-15 07:33:34  IST  )

నేను తెలుగుభాష లెక్క.. అక్కడా ఉంటా.. ఇక్కడా ఉంటా..’ అని ఒక పాపులర్​సినిమా డైలాగ్​గుర్తుంది కదా..! అలాగే జాతీయ పార్టీ తెలుగుదేశం విస్తరణ అంశంలోనూ ఇటీవల ఆ పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి

Telangana TDP: తెలంగాణలో పునరాగమనం! వచ్చే ఎన్నికల్లో పోటీకి టీడీపీ సన్నద్ధం ?
X

తెలంగాణలో పుట్టిన పార్టీ టీడీపీ.. తప్పకుండా ఫోకస్​పెడతాం

ఓ చానల్​ఇంటర్వ్యూలో ఏపీ సీఎం చంద్రబాబు వెల్లడి

అధినేత వ్యాఖ్యలతో టీ టీడీపీ శ్రేణుల్లో ఉత్తేజం

దిశ, డైనమిక్​ బ్యూరో : ‘నేను తెలుగుభాష లెక్క.. అక్కడా ఉంటా.. ఇక్కడా ఉంటా..’ అని ఒక పాపులర్​సినిమా డైలాగ్​గుర్తుంది కదా..! అలాగే జాతీయ పార్టీ తెలుగుదేశం విస్తరణ అంశంలోనూ ఇటీవల ఆ పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి. ఏపీలో ఏడాది పాలన పూర్తయి సందర్భంగా ఆయన ఓ టీవీ చానల్​కు ఇంటర్వ్యూ ఇచ్చారు. యాంకర్​అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ తెలుగువారు ఎక్కడున్నా వారి అభ్యున్నతి కోసం తెలుగుదేశం పార్టీ పని చేస్తుందని చంద్రబాబు స్పష్టం చేశారు. ‘తెలంగాణ మీది ఫోకస్​ఉంటుందా.. అనే ప్రశ్నకు కచ్చితంగా ఉంటుందని చంద్రబాబు సమాధానం ఇచ్చారు. హైదరాబాద్​ఎమ్మెల్యే క్వార్టర్ట్స్​లో పుట్టిన పార్టీ తెలుగుదేశమని పేర్కొన్నారు. టీడీపీ కేవలం ఒక రాష్ట్రానికి చెందినది కాదని, తెలుగు జాతి సమగ్ర వికాసాన్ని ధ్యేయంగా పెట్టుకుని తెలుగువారు ఎక్కడున్నా వారిని బలోపేతం చేయాలనే ఆశయంతో స్థాపించారని గుర్తు చేశారు. రాష్ట్ర విభజన తర్వాత తాత్కాలికంగా ఎదురైన కొన్ని సమస్యల వల్ల తెలంగాణలో పార్టీ బలహీనపడిందని చంద్రబాబు అంగీకరించారు. వాటిని అధిగమించి ముందుకు సాగుతామని ధీమా వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలు తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పునరాగమనానికి సంకేతమని పార్టీ శ్రేణులు భావిస్తున్నారు.

ఎమ్మెల్యే క్వార్టర్స్​లో ఆవిర్భావం

1982 మార్చి 29న అప్పటి ఉమ్మడి రాజధాని హైదరాబాద్​లోని ఎమ్మెల్యే క్వార్టర్స్​లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించింది. తర్వాత సంవ్సతరం జనవరి 5న జరిగిన ఎన్నికల్లో సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. 292 స్థానాలకు 202 స్థానాల్లో గెలిచి పుసుపు జెండా ఎగరేసి ఎన్టీ రామారావు (NT Ramarao) ముఖ్యమంత్రి అయ్యారు. పార్టీ స్థాపించిన ఎనిమిది నెలల్లో ఇంతటి ఘన విజయాన్ని సొంతం చేసుకోవడం ఓ రికార్డు. ఈ 40 ఏళ్లలో ఆ పార్టీ ఎన్నో ఒడిదుడుకలను ఎదుర్కొని నిలిచింది. 2014 జూన్ 2న హైదరాబాద్ రాజధానిగా తెలంగాణ అవతరించింది. ఆ తర్వాత విభజిత ఏపీలో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది. తెలంగాణలో కొద్దిసీట్లకే పరిమితమైంది. 2018లో జరిగిన ఎన్నికల్లో ప్రజా కూటమి పేరుతో తెలుగుదేశం పార్టీ తెలంగాణలో పోటీ చేయగా, ఇద్దరు అభ్యర్థులు గెలిచారు. సత్తుపల్లి (ఎస్సీ) నియోజకవర్గం నుంచి సండ్ర వెంకట వీరయ్య, అశ్వరావుపేట నుంచి మెచ్చా నాగేశ్వరరావు విజయం సాధించారు. అనంతర పరిణామాలతో వారిద్దరూ బీఆర్ఎస్​లో చేరారు. తర్వాత 2023 ఎన్నికల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేయలేదు. కొంతకాలం పార్టీ స్తబ్దుగా ఉంది. అదే సమయంలో ఏపీలో చారిత్రాత్మక విజయాన్ని అందుకోవడం పార్టీ శ్రేణుల్లో జోష్​ను నింపింది. అదే ఊపుతో తెలంగాణలోనూ పార్టీని పునరుజ్జీవం పొందుతుందని కార్యకర్తలు భావిస్తున్నారు.

వెన్నుదన్నుగా నిలిచిన తెలంగాణ

ఏపీలో గత వైసీపీ ప్రభుత్వంలో చంద్రబాబు అరెస్టు అయ్యారు. ఆ సమయంలో తెలంగాణలో పార్టీ సానుభూతిపరుల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా హైదరాబాద్, ఖమ్మంలో నిరసనలు పెల్లుబికాయి. టీడీపీని అభిమానించే వారితో పాటు, ఐటీకి చెందిన వారు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేపట్టారు. ఆయనపై ఇప్పటికీ ఉన్న అభిమానానికి ఇది నిదర్శనమని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఈ క్రమంలోనే మొన్న ఏపీలో జరిగిన మహానాడు కార్యక్రమానికి కూడా స్వచ్ఛందంగా పెద్ద సంఖ్యలో తెలంగాణ నుంచి టీడీపీ శ్రేణులు తరలివచ్చారు. అమరావతి రాజధాని నిర్మాణ పున:ప్రారంభ వేడుకకు సైతం హైదరాబాద్​నుంచి పెద్ద సంఖ్యలో టీడీపీ అభిమానులు తరలివచ్చారు. ఇటీవల చంద్రబాబు హైదరాబాద్​కు తరచూ వెళ్లి ఎన్టీఆర్​భవన్ లో పార్టీ కార్యకర్తలతో మమేకమవుతున్నారు. దీంతో ఆయన టీ టీడీపీకి అధ్యక్షుడిని నియమించి పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా తీసుకు వెళతారని అంతా ఎదురుచూస్తున్నారు.

Next Story