స్వచ్ఛాంధ్ర సంకల్పం చెత్త కుప్పలపాలు

by Thanuru Gopichand |

సీఎం చంద్రబాబు నాయుడు ఎంతో ప్రతిష్టాత్మకంగా 'స్వర్ణాంధ్ర - స్వచ్ఛాంధ్ర' (Swarnandhra-Swachhandhra) సంకల్పం చేపట్టారు.

స్వచ్ఛాంధ్ర సంకల్పం చెత్త కుప్పలపాలు
X

దిశ, వెబ్ డెస్క్ : సీఎం చంద్రబాబు నాయుడు ఎంతో ప్రతిష్టాత్మకంగా 'స్వర్ణాంధ్ర - స్వచ్ఛాంధ్ర' (Swarnandhra-Swachhandhra) సంకల్పం చేపట్టారు. కానీ ఆ సంకల్పంలో విశాఖ నగరంలో (Visaka City) నీరుగారిపోతోందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నగరంలోని ప్రధాన కూడళ్లు, అంతర్గత రహదారులు ప్రస్తుతం చెత్తకుప్పలకు నిలయాలుగా మారాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ద్వారకానగర్, సీతంపేట, సీతమ్మధార వంటి రద్దీ ప్రాంతాల్లో ఎక్కడికక్కడ పేరుకుపోయిన వ్యర్థాలతో కంపు కొడుతున్నాయని ఆయా ప్రాంతాలవాసులు చెబుతున్నారు. స్వచ్ఛాంధ్ర నిధుల దుర్వినియోగంపై అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.

వీఐపీల పర్యటనప్పుడే..

సీఎం.. ఇతర వీఐపీల పర్యటనప్పుడు హడావుడి చేసే అధికారులు సాధారణ సమయాల్లో మాత్రం పారిశుద్ధ్యం విషయాన్ని పట్టించుకోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. స్వచ్ఛత కేవలం వారి పర్యటనల సమయానికే పరిమితమవుతోందని విమర్శిస్తున్నారు. రోడ్లపై చెత్త వేస్తే రూ.500ల నుంచి రూ.వెయ్యి వరకు జరిమానా విధిస్తామని.. డ్రోన్లతో నిఘా పెడతామని జీవీఎంసీ కమిషనర్ ప్రకటించిన విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. ప్రకటనలు చేసినప్పటికీ అవి ఆచరణలోకి రాకపోవడంతో సమస్య తీవ్రమవుతోందని వాపోతున్నారు.

ప్రకటనలకే పరిమితమా?

చెత్తను రోడ్లపై వేస్తే చర్యలు తీసుకుంటామంటున్న అధికారుల మాటలు ప్రకటనలకే పరిమితమవుతున్నాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బహిరంగ ప్రదేశాల్లో చెత్తవేసే వారి పై చర్యలు లేకపోవడంతో నానాటికీ సమస్య పెరుగుతుందనే వాదనలు బలపడుతున్నాయి. కఠినతరంగా నిబంధనల అమలు లేకపోవడంతో బహిరంగ ప్రదేశాల్లో చెత్తే వేసే వారి సంఖ్యో పెరుగుతోంది. చెత్త కుప్పల నుంచి వచ్చే దుర్గంధం పాదచారులు, వాహనదారులు, పరిసరవాసుల ముక్కు పుటాలను అదరగొడుతున్నాయి. అంతేకాకుండా ప్రజారోగ్యం పై దుష్ప్రభావం పడుతుందనే మాటలు వినిపిస్తున్నాయి. పారిశుద్ధ్య సిబ్బంది శుభ్రం చేస్తున్నప్పటికీ సరైన నిఘా కొరవడి సమస్య పునరావృతం అవుతోంది.

నిధుల దుర్వినియోగంపై అనుమానాలు

స్వచ్ఛాంధ్ర కార్యక్రమం కోసం ప్రభుత్వం కేటాయిస్తున్న వందల కోట్ల నిధులు పబ్లిక్ హెల్త్ డిపార్ట్‌మెంట్ నిర్లక్ష్యం వల్ల దుర్వినియోగమవుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు భారీగా నిధులు వెచ్చిస్తున్నా, అధికారులు మాత్రం మొక్కుబడి తనిఖీలతో కాలక్షేపం చేస్తున్నారని నగరవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి.. కేవలం ప్రకటనల కోసమే కాకుండా నిరంతరం నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేలా చర్యలు తీసుకోవాలని విశాఖ ప్రజలు కోరుతున్నారు.

Next Story