స్వచ్ఛాంధ్ర నినాదం ప్రజల జీవన విధానం కావాలి : సీఎం

by Thanuru Gopichand |

సింగపూర్ స్ఫూర్తితో జన్మభూమి కార్యక్రమం ప్రారంభించాం.

స్వచ్ఛాంధ్ర నినాదం ప్రజల జీవన విధానం కావాలి : సీఎం
X

దిశ, వెబ్ డెస్క్: స్వచ్చాంధ్ర (Swachhandhra) నినాదం ప్రజల జీవన విధానం కావాలని సీఎం చంద్రబాబు నాయుడు (Chandra Babu Naidu) ఆకాంక్షించారు. చిత్తూరు జిల్లాలోని నగరిలో (Nagari) ఉన్న శాప్స్ స్పోర్ట్స్ గ్రౌండ్ లో జరుగుతున్న స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి సీఎం ముఖ్య ఆహ్వానితులుగా హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడుతూ ప్రతి నెల ఒక కొత్త థీమ్ తో స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని చేస్తున్నాం అన్నారు. ప్రజలు కూడా స్వచ్ఛతను బాధ్యతగా భావించాలన్నారు. కాలుష్య నివారణలో భాగస్వాములు కావాలన్నారు. ప్రజలను వివిధ కార్యక్రమాల ద్వారా చైతన్యపరుస్తూ పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు చేసేందుకు కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందన్నారు.

ఎన్నికలకు ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ (Super Six) హామీలను కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో సూపర్ హిట్ చేశామని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. ఇంట్లో ఎంతమంది విద్యార్థులుంటే అంత మందికి తల్లికి వందనం పథకం ద్వారా రూ.15వేలు ఇచ్చామన్నారు. చెప్పినట్లుగానే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించామన్నారు. రైతులకు అన్నదాత సుఖీభవ నిధులు జమ చేశామన్నారు.

పాలకులు స్వచ్ఛమైన ఆలోచనలు చేస్తే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వచ్ఛ భారత్ స్ఫూర్తితో స్వచ్ఛాంధ్ర అమలు చేస్తున్నాని సీఎం చంద్రబాబు తెలియజేశారు. సింగపూర్ లో రోడ్లు పరిశుభ్రంగా ఉంటాయన్నారు. వారి ఆలోచనలు కూడా స్వచ్ఛంగానే ఉంటాయని పేర్కొన్నారు. సింగపూర్ స్ఫూర్తితో గతంలో జన్మభూమి కార్యక్రమం మొదలుపెట్టిన విషయాన్ని గుర్తు చేశారు. రానున్న ఐదేళ్లలో ఏపీని దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా తయారు చేస్తామని సీఎం కుండ బద్దలుకొట్టారు. రానున్న నాలుగేళ్లలో 26వేల కిలోమీటర్ల మేర మ్యాజిక్ డ్రెయిన్లు ఏర్పాటు చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు.

గత ప్రభుత్వం 105 లక్షల మెట్రిక్ టన్నుల చెత్త వదిలిపోయిందన్నారు. తాము వచ్చిన ఏడాదిన్నరలోనే లెగసీ వేస్ట్ ని పూర్తిగా తొలగించామని సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. పట్టణ ప్రాంతాల్లో ఇంటింటికీ వెళ్లి చెత్తను సేకరిస్తున్నామని తెలిపారు. చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంట్స్ ఏర్పాటు చేశామన్నారు. డ్వాక్రా సంఘాలు తయారు చేసిన కంపోస్ట్ ను రైతులకు సరఫరా చేస్తున్నామని చెప్పారు. చెత్త నుంచి సంపద సృష్టించి చూపిస్తున్నామని ప్రకటించారు.

ఇప్పటికే చాలా మున్సిపాలిటీల్లో ప్లాస్టిక్ ను నిషేధించామన్నారు. వారానికి ఒకసారి స్వచ్ఛ రథాలు వచ్చేలా ఏర్పాట్లు చేశామన్నారు. 2018లోనే రాష్ట్రాన్ని ఓడీఎఫ్ తయారు చేశామని, ప్రస్తుతం ఓడీఎఫ్ ప్లస్ వైపు ప్రయాణిస్తున్నాం అన్నారు. విద్యార్థుల పరిశుభ్రత కోసం స్కూల్స్ లో ముస్తాబు కార్యక్రమం తీసుకొచ్చామన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు చిన్నతనం నుంచే పరిశుభ్రత నేర్పాలన్నారు.

Next Story