నకిలీ మద్యం కేసులో నిందితులకు కస్టడీ

by Thanuru Gopichand |

నకిలీ మద్యం కేసులో (Fake Liquor Scam) కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించి మొత్తం నలుగురు నిందితులను కస్టడీకి అప్పగిస్తూ విజయవాడ కోర్టు తాజాగా ఆదేశాలు జారీ చేసింది.

నకిలీ మద్యం కేసులో నిందితులకు కస్టడీ
X

దిశ, వెబ్ డెస్క్ : నకిలీ మద్యం కేసులో (Fake Liquor Scam) కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించి మొత్తం నలుగురు నిందితులను కస్టడీకి అప్పగిస్తూ విజయవాడ కోర్టు తాజాగా ఆదేశాలు జారీ చేసింది. అబ్కారీ శాఖ అధికారులు (Excise Officers) నిందితులను పది రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలని కోర్టును అభ్యర్థించింది. దానిపై విచారించిన న్యాయస్థానం ఇందుకు పాక్షికంగా అంగీకరించింది. కోర్టు ఆదేశాల ప్రకారం నిందితులైన కట్టా రాజు, సయ్యద్ హజీ, అంథాదాస్, మిథున్ దాస్ లను డిసెంబర్ 11 నుంచి డిసెంబర్ 15 వరకు ఐదు రోజుల పాటు ఎక్సైజ్ శాఖ కస్టడీలోకి తీసుకోనుంది. ఈ వ్యవధిలో నిందితుల నుంచి నకిలీ మద్యం తయారీ, పంపిణీకి సంబంధించిన కీలక సమాచారాన్ని రాబట్టడానికి దర్యాప్తు అధికారులు ప్రయత్నించనున్నారు.

​ఈ నకిలీ మద్యం కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అన్నమయ్య జిల్లా ములకలచెరువుతో పాటు ఇతర ప్రాంతాల్లో నకిలీ మద్యం తయారీ కేంద్రాలు వెలుగులోకి రావడంతో ప్రభుత్వం సిట్ (SIT) ను ఏర్పాటు చేసింది. ఈ కేసులో ఇప్పటికే పలువురు కీలక వ్యక్తులను అరెస్టు చేయడం జరిగింది. మాజీ మంత్రి జోగి రమేష్, ఆయన సోదరుడు జోగి రాముపైనా ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో సిట్ ఇటీవల కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేసిన విషయం విదితమే. తాజాగా మరో నలుగురు నిందితుల కస్టడీ ద్వారా లభించే సమాచారం మేరకు కేసు దర్యాప్తులో మరింత ముందుకు వెళ్లడానికి అవకాశం ఏర్పడనుంది. ఈ దందా వెనుక ఉన్న పూర్తిస్థాయి నెట్‌వర్క్‌ను ఛేదించడానికి అధికారులకు ఈ అవకాశం దోహదపడనుందని తెలుస్తోంది.

Next Story