తోతాపురి మామిడి రైతులను ఆదుకోండి.. కేంద్రానికి సీఎం చంద్రబాబు కీలక లేఖ

by Kema Shiva Kumar |

ఏపీలో తోతాపురి మామిడి రైతులను ఆదుకోవాలంటూ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌కు సీఎం చంద్రబాబు లేఖ రాశారు.

తోతాపురి మామిడి రైతులను ఆదుకోండి.. కేంద్రానికి సీఎం చంద్రబాబు కీలక లేఖ
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న తోతాపురి మామిడి రైతులను ఆదుకోవాలంటూ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌ (Shivraj Singh Chouhan)కు సీఎం చంద్రబాబు (CM Chandrababu) ఇవాళ కీలక లేఖ రాశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో మామిడి రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరిస్తూ, కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి అండగా నిలవాలని లేఖలో విన్నవించారు. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితుల వల్ల మామిడి పల్ప్ ఎక్స్‌పోర్టులు నిలిచిపోయాయని పేర్కొన్నారు. దీంతో మార్కెట్లో తోతాపురి మామిడి ధరలు పడిపోయి, రైతులు తీవ్ర నష్టాలను చవిచూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంక్షోభం నుంచి తోతాపురి మామిడి రైతులను గట్టెక్కించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకోవాలని సీఎం చంద్రబాబు కోరారు.

రూ.281 కోట్ల ఆర్థిక సాయం చేయండి..

రాష్ట్రంలో సుమారు 7.03 లక్షల మెట్రిక్ టన్నుల తోతాపురి మామిడి కొనుగోళ్లకు గానూ, రైతులకు మద్దతుగా నిలిచేందుకు రూ.281 కోట్ల ఆర్థికసాయం అందించాలని సీఎం చంద్రబాబు కేంద్రానికి వివరించారు. అలాగే, మార్కెట్ ధరల్లో లోటును భర్తీ చేసేందుకు వీలుగా మామిడి రైతుల కోసం ప్రత్యేకంగా ప్రైస్ డెఫిషియన్సీ పేమెంట్ స్కీం (Price Deficiency Payment Scheme) అమలు చేయాలని కేంద్రమంత్రిని సీఎం చంద్రబాబు కోరారు.

Next Story