పదో తరగతి పరీక్ష కేంద్రంలో విషాదం.. భయంతో స్టూడెంట్స్ పరుగులు

by Naga Rani Yarlagadda |

పదో తరగతి పరీక్షాకేంద్రంలో కనిపించిన ఘటన చూసి విద్యార్థులు పరుగులుతీశారు. మరో కేంద్రంలో సూపరింటెండెంట్ గుండెపోటుతో మరణించారు.

పదో తరగతి పరీక్ష కేంద్రంలో విషాదం.. భయంతో స్టూడెంట్స్ పరుగులు
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ లో సోమవారం ఉదయం 9.30 గంటలకు పదో తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. కొన్ని పరీక్షా కేంద్రాల్లో ఊహించని ఘటనలు చోటుచేసుకున్నాయి. కర్నూలు టౌన్ లో ఒక పరీక్షా కేంద్రంలో విషాద ఘటన జరిగింది. నిర్జూరు జడ్పీ ఉన్నత పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్న అన్వర్ బాషా.. ఓ పరీక్షా కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్ గా విధులకు వెళ్లాడు. అక్కడ పరీక్ష విధులు నిర్వహిస్తుండగా గుండెపోటుకు గురై కుప్పకూలిపోగా.. తోటి సిబ్బంది ఆస్పత్రికి తరలించేలోగానే మృతి చెందారు.

పరీక్షా కేంద్రంలో పాము

మరోవైపు కడప జిల్లా బి.కోడారు లో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రంలోకి పాము రావడం కలకలం రేపింది. తరగతి గదిలో పామును చూసిన విద్యార్థులు భయంతో పరుగులు తీశారు. సిబ్బంది వెంటనే అప్రమత్తమత్తమై పామును చంపి బయటపడేయడంతో విద్యార్థులు ఊపిరి పీల్చుకున్నారు.

పరీక్ష ఎక్కడ రాయాలో తెలియక..

పదో తరగతి పరీక్షల వేళ.. కావలి విశ్వోదయ బాలుర ఉన్నత పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపించింది. స్కూల్లో పదో తరగతి పరీక్షలు నిర్వహించాల్సి ఉండగా.. ఒక్క క్లాస్ రూమ్ లోనూ హాల్ టికెట్ నంబర్లను వేయలేదు. దీంతో పరీక్ష రాసేందుకు వచ్చిన విద్యార్థులు.. ఏ రూమ్ లో ఎగ్జామ్ రాయాలో తెలియక అయోమయానికి గురయ్యారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయులు, సిబ్బంది నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే సిబ్బంది స్కూల్ ప్రాంగణంలో ఉన్న బోర్డుపై తూతూ మంత్రంగా హాల్ టికెట్ నంబర్లు రాశారు.

Next Story