పాఠశాలలో పురుగులన్నం పెడుతున్నారంటున్న విద్యార్థులు

by Thanuru Gopichand |

పాఠశాలలో పురుగులన్నం పెడుతున్నారంటూ శ్రీ సత్యసాయి జిల్లాలోని కదిరి ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాల (Kadiri Tribal Welfare School) విద్యార్థులు అంటున్నారు.

పాఠశాలలో పురుగులన్నం పెడుతున్నారంటున్న విద్యార్థులు
X

దిశ, వెబ్ డెస్క్ : పాఠశాలలో పురుగులన్నం పెడుతున్నారంటూ శ్రీ సత్యసాయి జిల్లాలోని కదిరి ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాల (Kadiri Tribal Welfare School) విద్యార్థులు అంటున్నారు. నాణ్యమైన భోజనం పెట్టడం లేదంటూ పాఠశాల ఆవరణలో శుక్రవారం నిరసనకు దిగారు. చేతిలో అన్నం కంచెం పట్టుకొని అందులోని ఆహారాన్ని అందరికీ చూపిస్తూ తమ బాధను వ్యక్తం చేశారు. పురుగులన్నంతో (Contaminated Food) పాటు కుళ్లిన కూరగాయలతో కూరలు, నీటిని తలపించే పప్పును వండి వడ్డిస్తున్నారని విద్యార్థులు వాపోతున్నారు. అటువంటి అన్నం తినడం వల్ల తాము అనారోగ్యానికి గురవుతున్నాం అంటున్నారు. ఇదే విషయాన్ని పాఠశాల ఉపాధ్యాయులు, ప్రిన్సిపాల్ దృష్టికి తీసుకెళ్లే వారి నుంచి సరైన స్పందన లభించడం లేదని వాపోతున్నారు. ప్రిన్సిపాల్ తమకేం పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని పేర్కొంటున్నారు. తాను కాలు మీద కాలేసుకొని కూర్చున్నా తన జీతం తనకొస్తుందని అంటున్నారంటూ ఆవేదన వెల్లిబుచ్చుతున్నారు. తమను హేళన చేస్తూ చిన్న చూపు చూస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు రక్షణగా ఉండి, విద్యార్థుల పక్షాన మాట్లాడాల్సిన ప్రిన్సిపాల్ అలా మాట్లాడే సరికి వారు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నట్లు చెబుతున్నారు. ఇదే విధంగా పరిస్థితి కొనసాగితే తమ ఆరోగ్యం ప్రమాదంలో పడుతుందంటున్నారు.

విద్యార్థులు చేపట్టిన ధర్నాకు పలువురు విద్యార్థి సంఘాల నేతలు మద్ధతు పలికారు. పోషకాహారం అందించాల్సిన చోట పురుగులన్నం పెట్టడం ఏమిటని ప్రశ్నించారు. ప్రిన్సిపాల్ పై ఆరోపణల వర్షాన్ని కురిపించారు. నాణ్యమైన ఆహారం పెట్టలేకపోవడం వెనుక కారణాలను తెలియజేయాలని నిలదీశారు. ఇది నిర్లక్ష్యంతో కూడుకున్నదా లేక ప్రభుత్వ వైఫల్యమా అని ప్రశ్నించారు. ఈ విషయంపై ఉన్నతాధికారులు స్పందించి నాణ్యమైన పోషకాహారం విద్యార్థులకు అందేలా చూడాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల ఆరోపణలను పరిశీలించి.. వాటిలో వాస్తవం ఉంటే ప్రిన్సిపాల్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Next Story