- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

దిశ, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ లో సంక్రాంతి (Sankranthi) సందడి మొదలైంది. ఉపాధి, వ్యాపారాల నిమిత్తం ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారు మెల్లగా స్వగ్రామాలకు చేరుకుంటున్నారు. దీంతో రాష్ట్రంలోని పల్లెలు, పట్టణాల్లో సందడి నెలకొంది. అయితే మరోవైపు జూదం కూడా జోరుగా సాగుతున్నట్లు తెలుస్తోంది. వాటిని నియంత్రించడానికి పోలీసు శాఖ (AP Police) కూడా రంగంలోకి దిగింది. పండుగ పేరిట జరిగే అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్ర పోలీసు యంత్రాంగం కఠిన చర్యలను చేపట్టింది. ముఖ్యంగా కోడి పందేలు, పేకాట, గుండాట వంటి జూద క్రీడల నిర్వహణపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అప్రమత్తమైన పోలీస్ అధికారులు జూదగాళ్లకు ఇప్పటికే గట్టి హెచ్చరికలు జారీ చేశారు. పండగ వేళ వాటికి దూరంగా ఉండి కుటుంబానికి దగ్గరవ్వాలని పోలీసులు కోరుతున్నారు.
జూదగాళ్లకు పోలీసుల హెచ్చరిక
సంక్రాంతి పండుగను ఆచార సంప్రదాయాల ప్రకారం జరుపుకోవాలే తప్ప జూదానికి వేదికగా మార్చవద్దని ఆంధ్రప్రదేశ్ పోలీసులు స్పష్టం చేశారు. ఎక్కడైనా కోడి పందేలు, పేకాట శిబిరాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ కార్యాలయం నుంచి జిల్లా ఎస్పీల వరకు అందరూ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. కోడి పందేలు నిర్వహించడం లేదా అందులో పాల్గొనడం చట్టరీత్యా నేరమని, నిందితులపై 'ఆంధ్రప్రదేశ్ గేమింగ్ యాక్ట్', 'ప్రివెన్షన్ ఆఫ్ క్రూయాల్టీ టు యానిమల్స్ యాక్ట్' కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. అరెస్టయిన వారిపై రౌడీ షీట్లు తెరిచేందుకు కూడా వెనుకాడబోమని పోలీసులు పేర్కొంటున్నారు.
ప్రత్యేక బృందాలు - నిరంతర నిఘా
జూదాన్ని నిరోధించేందుకు రాష్ట్రవ్యాప్తంగా ప్రతి మండల కేంద్రంలోనూ ప్రత్యేక బృందాలను (Special Teams) ఏర్పాటు చేశారు. ఈ బృందాలు గ్రామాల్లో నిరంతరం గస్తీ నిర్వహిస్తాయని అధికారులు తెలిపారు. ముఖ్యంగా పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కోడి పందేల ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి, ఆయా ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించారని పేర్కొన్నారు. ఆధునిక సాంకేతికతను జోడించి, డ్రోన్ కెమెరాల ద్వారా పొలాల్లో లేదా రహస్య ప్రాంతాల్లో ఏర్పాటు చేసే పందేల బరులను గుర్తించేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. ఎక్కడైనా అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు తెలిస్తే వెంటనే డయల్ 100కు సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరుతున్నారు.
ప్రైవేట్ స్థలాలపై ప్రత్యేక దృష్టి
చాలామంది పోలీసుల కన్నుగప్పి ప్రైవేట్ తోటల్లో, పొలాల్లో లేదా ఇంటి ఆవరణల్లో కోడి పందేలు, పేకాట నిర్వహిస్తుంటారు. ఈ నేపథ్యంలో పోలీసులు కీలక ప్రకటన చేశారు. ఒకవేళ ఎవరికైనా చెందిన ప్రైవేట్ స్థలాల్లో జూదం నిర్వహించినట్లు తేలితే, కేవలం నిర్వహించిన వారే కాకుండా ఆ స్థల యజమానులపై కూడా క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు.
సంప్రదాయం పేరుతో చట్టం ఉల్లంఘన కుదరదు
కోడి పందేలు అనేవి తమ ప్రాంతీయ సంప్రదాయమని కొందరు వాదిస్తున్నప్పటికీ, ప్రాణహింస, కోట్లాది రూపాయల జూదం ఇందులో ఇమిడి ఉండటం వల్ల న్యాయస్థానాలు వీటిని నిషేధించాయని పోలీసులు చెబుతున్నారు. ఈ ఆదేశాలను పక్కాగా అమలు చేసేందుకు రెవెన్యూ, పోలీస్ శాఖలు సంయుక్తంగా పనిచేస్తున్నాయని పేర్కొంటున్నారు. పండుగ పూట జైలు పాలు కాకుండా, కుటుంబ సభ్యులతో కలిసి ప్రశాంతంగా పండుగ జరుపుకోవాలని పోలీస్ అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈసారి పందేల బరులను సిద్ధం చేసే వారిపై ముందస్తుగా కేసులు నమోదు చేసి, సామాగ్రిని సీజ్ చేస్తున్నారు.






