తుఫాను ప్రాంతాల్లో అలర్ట్ గా ఉండండి : పవన్ కల్యాణ్

by Muthe.Rajitha |

‘మొంథా’ తుపాను సందర్భంగా కాకినాడ ప్రాంతంలో తుపాను తీరం దాటనుండటంతో జిల్లాలో చేపట్టాల్సిన చర్యలపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

తుఫాను ప్రాంతాల్లో అలర్ట్ గా ఉండండి : పవన్ కల్యాణ్
X

దిశ, వెబ్ డెస్క్ : ‘మొంథా’ తుపాను సందర్భంగా కాకినాడ ప్రాంతంలో తుపాను తీరం దాటనుండటంతో జిల్లాలో చేపట్టాల్సిన చర్యలపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి పి.నారాయణ, ప్రత్యేక అధికారి కృష్ణ తేజ, కాకినాడ కలెక్టర్ షాన్ మోహన్, ఎస్పీ బిందు మాధవ్ పాల్గొన్నారు. జిల్లాలోని 12 మండలాలపై తుపాను ప్రభావం ఉంటుందని అధికారులు తెలిపారు.

తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తు చర్యలు పకడ్బందీగా తీసుకోవాలని, ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, వారికి ఆహారం, రక్షిత తాగునీరు, పాలు, ఔషధాలు సమకూర్చాలని పవన్ కల్యాణ్ సూచించారు. గాలుల తీవ్రత వల్ల విద్యుత్ స్తంభాలు పడిపోతే వెంటనే పునరుద్ధరించాలని, ఆసుపత్రుల్లో వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచాలని, యంత్రాంగం సిద్ధంగా ఉన్నందున ప్రజలు ఆందోళన చెందవద్దని ఆయన పేర్కొన్నారు.

విపత్తు సమయంలో అసత్య ప్రచారాలు మానుకోవాలి

మొంథా తుఫాన్ తీరం దాటనున్న తరుణంలో కొంతమంది వ్యక్తులు కాకినాడ పరిసర ప్రాంతాలలో ఇప్పటికే తుఫాన్ ప్రభావం తీవ్రంగా ఉంది అన్నట్లుగా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. ప్రస్తుతం కాకినాడ ప్రాంతంలో వాతావరణం ప్రశాంతంగా ఉందని, తుఫాన్ పరిస్థితిపై వాస్తవ సమాచారం కోసం దయచేసి కాకినాడ కలెక్టర్, కాకినాడ పోలీస్ సోషల్ మీడియా ఖాతాల్లో వచ్చే సమాచారం, సూచనలు పాటించి అప్రమత్తతతో వ్యవహరించాలని విజ్ఞప్తి చేసారు.

Next Story