చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం : గణాంకాలతో విరుచుకుపడిన జగన్

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-03-11 07:46:13  IST  )

చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం : గణాంకాలతో విరుచుకుపడిన జగన్
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాక ఆర్థిక వ్యవస్థ పూర్తిగా చిన్నాభిన్నమైందని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విమర్శించారు. బుధవారం తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఆదాయం తగ్గి, అప్పులు అమాంతం పెరిగాయని, దీనికి కాగ్ (CAG) నివేదికే సాక్ష్యమని పేర్కొన్నారు.

ఆర్థిక గణాంకాలతో విరుచుకుపడ్డ జగన్

రాష్ట్ర ఆదాయం, ఖర్చుల మధ్య వ్యత్యాసాన్ని జగన్ లెక్కలతో సహా వివరించారు. వైసీపీ హయాంలో 2023-24లో రాబడులు రూ. 1,70,767 కోట్లు ఉండగా, చంద్రబాబు వచ్చాక తొలి ఏడాది అది రూ.1,68,024 కోట్లకు పడిపోయిందన్నారు. చంద్రబాబు హయాంలో రెవిన్యూ లోటు 56 శాతం, ద్రవ్య లోటు 30 శాతం పెరిగిందని పేర్కొన్నారు. రెవిన్యూ లోటు ఏకంగా రూ. 60,285 కోట్లకు చేరిందన్నారు. చంద్రబాబు రెండేళ్లలోనే రూ.3.2 లక్షల కోట్లు అప్పులు తెచ్చారని దుయ్యబట్టారు. వైఎస్సార్‌సీపీ ఐదేళ్ల పాలనలో చేసిన మొత్తం అప్పు రూ.3.31 లక్షలతో పోలిస్తే, వీరు కేవలం రెండేళ్లలోనే దాదాపు అంతే అప్పు చేశారని మండిపడ్డారు.

రూ. 20 వేల కోట్ల అప్పుల మాయాజాలం

ప్రభుత్వం అసెంబ్లీలో చెప్పే అప్పుల లెక్కలకు, కాగ్ రిపోర్టుకు మధ్య రూ. 20 వేల కోట్ల వ్యత్యాసం ఉందని జగన్ ఆరోపించారు. బడ్జెట్ అప్పులు రూ. 60,485 కోట్లు అని ప్రభుత్వం చెబితే, కాగ్ మాత్రం రూ. 81,071 కోట్లు అని తేల్చిందని, వాస్తవాలను దాచిపెడుతున్నారని విమర్శించారు. బడ్జెట్ వెలుపల చేసిన అప్పుల వివరాలను అడిగినా ప్రభుత్వం సమాధానం చెప్పలేదన్నారు. సభను తప్పుదోవ పట్టించిన అధికారులపై డీవోపీటీకి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు.

విచ్చలవిడి దోపిడీ - విశాఖ భూదోపిడీయే నిదర్శనం

"ఇసుక, మట్టి, భూములు, లిక్కర్.. దేన్నీ వదలడం లేదు. అన్నింటా దోపిడీయే" అని జగన్ కూటమి పాలనపై ధ్వజమెత్తారు. విశాఖపట్నంలో రూ.5 వేల కోట్ల విలువైన 54 ఎకరాల ప్రభుత్వ భూమిని చంద్రబాబు బంధువు ఆక్రమించుకుంటున్నా ప్రభుత్వం చోద్యం చూస్తోందని ఆరోపించారు. ఈ దోపిడీ వల్లనే ప్రభుత్వానికి రావాల్సిన రాబడులు రావడం లేదన్నారు.

ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కూడా ప్రభుత్వం విఫలమైందని జగన్ దుయ్యబట్టారు. తమ హయాంలో 66.34 లక్షల మందికి పెన్షన్లు ఇస్తే, ప్రస్తుతం ఆ సంఖ్యను 60.69 లక్షలకు తగ్గించారని, కేవలం ఒక్క నెలలోనే 25 వేల పెన్షన్లు కట్ చేశారని ఆరోపించారు. అమ్మ ఒడి స్థానంలో తెచ్చిన ఈ పథకంలో 20 లక్షల మంది పిల్లల పేర్లను తొలగించారని మండిపడ్డారు. ప్రతి నిరుద్యోగికి రూ.1.08 లక్షల బకాయి పడ్డారని, దీనిపై అసెంబ్లీలో ప్రస్తావన లేదని విమర్శించారు. ఆడబిడ్డ నిధి (రూ. 1500), ఉచిత బస్సు ప్రయాణం, రైతు భరోసా వంటి హామీలకు బడ్జెట్‌లో సరైన కేటాయింపులు లేవన్నారు. రైతు సంక్షేమాన్ని ఈ ప్రభుత్వం గాలికొదిలేసిందని జగన్ విమర్శించారు. మొదటి ఏడాది ఇవ్వాల్సిన అన్నదాత సుఖీభవ డబ్బులను ఎగ్గొట్టారని, కౌలు రైతులకు ఒక్క రూపాయి ఇవ్వడం లేదని తెలిపారు. మిర్చి, శనగ, మొక్కజొన్న, అరటి పంటల ధరలు దారుణంగా పడిపోయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. మొక్కజొన్న రైతులు రూ.3,500 కోట్లు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మొంథా తుపాను ఇన్‌పుట్ సబ్సిడీ కానీ, ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు పరిహారం కానీ ఇప్పటివరకు అందలేదన్నారు. 16 రోజుల అసెంబ్లీ సమావేశాల వల్ల ప్రజలకు ఒరిగింది శూన్యమని ఆయన స్పష్టం చేశారు.

Next Story