Delhi: కేంద్రమంత్రి సీఆర్ పాటిల్‌తో చంద్రబాబు, పవన్ భేటీ.. కీలక అంశాలపై చర్చ

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-02-20 06:47:05  IST  )

ఢిల్లీలో కేంద్రమంత్రి సీఆర్ పాటిల్‌ను రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కలిశారు..

Delhi: కేంద్రమంత్రి సీఆర్ పాటిల్‌తో చంద్రబాబు, పవన్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఢిల్లీలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. కేంద్ర పెద్దలను కలిసి రాష్ట్ర సమస్యలను వివరించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఢిల్లీ వెళ్లారు. ఎంపీ రామ్మోహన్ నాయుడు ఆధ్వర్యంలో ఈ రోజు పలువురు కేంద్రమంత్రులను కలుస్తున్నారు. ఇందులో భాగంగా కేంద్రమంత్రి సీఆర్ పాటిల్‌ను చంద్రబాబు, పవన్ కల్యాణ్ కలిశారు. పోలవరం, బసకచర్ల ప్రాజెక్టులతో పాటు జల్ జీవన్ మిషన్‌పై ఆయనతో చర్చించారు. రాష్ట్రంలో జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి నీళ్లు అందించాలని ప్రయత్నిస్తున్న విషయాన్ని ఆయన వివరించారు.

అయితే 2024 డిసెంబర్‌తోనే ఈ పథకం ద్వారా నీళ్లు ఇవ్వాల్సి ఉండగా ఇప్పటివరకు ఈ హామీ నెరవేరలేదు. దీంతో ఈ గడువును 2028 వరకూ పొడిగించారు. ఈ మేరకు రూ.70 వేల కోట్లతో పనులకు కేంద్రానికి ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది. ఇదే విషయాన్ని కేంద్రమంత్రి సీఆర్ పాటిల్ దృష్టికి పవన్ తీసుకెళ్లారు. వేసవీ కాలం వస్తుండటంతో ఈ ప్రాజెక్టును మరింత ముందుకు నడిపేందుకు నిధులు విడుదల చేసి సహకరించాలని విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది.

కాగా రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో తాగు నీటి సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో 95.53 లక్షల ఇళ్లలో 70.44 లక్షల ఇళ్లకు కుళాయి ద్వారా నీళ్లు అందిస్తోంది. వచ్చే మూడు సంవత్సరాలలో మిగిలిన 20.09 లక్ష ఇళ్లకు కనెక్షన్లు ఇచ్చి పూర్తిగా నీళ్లు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా కేంద్రమంత్రి సీఆర్ పాటిల్‌ను చంద్రబాబు, పవన్ కలిసి సమస్యను పరిష్కరించాలని కోరారు.

Next Story