తిరుగుపయనం కష్టాలు.. విజయవాడ బస్సులో తొక్కిసలాట

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-01-19 09:03:36  IST  )

పండుగ సెలవులు ముగిశాయి. విద్యాసంస్థలు, ఆఫీసులు తిరిగి తెరచుకోవడంతో.. ఊళ్లకు వెళ్లినవారంతా మళ్లీ పట్నం బాటపట్టారు. ఈ క్రమంలో బస్సులు, రైళ్లలో ప్రయాణికుల రద్దీ భారీగా కనిపిస్తోంది.

తిరుగుపయనం కష్టాలు.. విజయవాడ బస్సులో తొక్కిసలాట
X

దిశ, వెబ్‌డెస్క్: పండుగ సెలవులు ముగిశాయి. విద్యాసంస్థలు, ఆఫీసులు తిరిగి తెరచుకోవడంతో.. ఊళ్లకు వెళ్లినవారంతా మళ్లీ పట్నం బాటపట్టారు. ఈ క్రమంలో బస్సులు, రైళ్లలో ప్రయాణికుల రద్దీ భారీగా కనిపిస్తోంది. టోల్ గేట్ల వద్ద కూడా కిలోమీటర్ల మేర వాహనాల క్యూలు దర్శనమిస్తున్నాయి. రైళ్లలో జనరల్ బోగీలతో పాటు.. స్లీపర్ కంపార్టుమెంట్లు కూడా కిక్కిరిసి కనిపిస్తున్నాయి. తిరుగుపయనంలో టికెట్లు దొరక్క.. స్పెషల్ బస్సులూ ఖాళీ లేక, ఊపిరి తీసుకునేందుకు కూడా గ్యాప్ లేనంతమంది ప్రయాణికులు ఆర్డినరీ బస్సుల్లో ఇరుక్కుని ప్రయాణిస్తున్నారు. సీట్ల కోసం గొడవలు పడుతున్నారు. ఈ క్రమంలో పల్నాడు జిల్లా వినుకొండలో బస్సు ఎక్కే క్రమంలో తొక్కిసలాట జరిగింది.

పండుగ సెలవులు ముగియడంతో వినుకొండ ఆర్టీసీ బస్టాండ్ గ్యారేజ్ వద్ద ఈ ఘటన జరిగింది. తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. విజయవాడకు వెళ్లే బస్సు ఎక్కే క్రమంలో ప్రయాణికుల మధ్య తొక్కిసలాట జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురికి తీవ్రగాయాలు అయ్యాయి.

ఆర్టీసీ కాంప్లెక్సులో పడిగాపులు

మరోవైపు బస్సులు లేక రాజమండ్రి ఆర్టీసీ కాంప్లెక్సులో ప్రయాణికులు పడిగాపులు పడుతున్నారు. విజయవాడ, విశాఖపట్నం వైపు వెళ్లే బస్సులు లేకపోవడంతో పిల్లలతో సహా గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొందని వాపోతున్నారు. అదనపు బస్సు సర్వీసులు లేకపోవడంతో అవస్థలు పడుతున్నామని, ఆర్టీసీ అధికారులు వెంటనే ఎక్స్ ట్రా బస్సులను కేటాయించాలని కోరుతున్నారు.

Next Story