శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు.. సీఎంకు ఆహ్వానం

by Naga Rani Yarlagadda |

శ్రీశైలం క్షేత్రం అత్యంత విశిష్టమైనది. ఇది భారతదేశంలోనే ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటిగా, అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటిగా ఏకకాలంలో పూజలందుకుంటున్న అరుదైన పుణ్యక్షేత్రం.

శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు.. సీఎంకు ఆహ్వానం
X

దిశ, వెబ్‌డెస్క్: శ్రీశైలం క్షేత్రం అత్యంత విశిష్టమైనది. ఇది భారతదేశంలోనే ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటిగా, అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటిగా ఏకకాలంలో పూజలందుకుంటున్న అరుదైన పుణ్యక్షేత్రం. ద్వాదశ జ్యోతిర్లింగాలలో రెండోవదిగా ఉన్న ఇక్కడ శివుడు మల్లికార్జునస్వామిగా, అష్టాదశ శక్తిపీఠాల్లో ఆరవదిగా ఉన్న ఆలయంలో సతీదేవి భ్రమరాంబికా దేవిగా కొలువై నిత్యపూజలందుకుంటున్నారు. ఈ క్షేత్రంలో రేపటి నుంచి (ఫిబ్రవరి 8) మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో శ్రీశైలం ఆలయ ఛైర్మన్, బోర్డు సభ్యులు సీఎం చంద్రబాబు నాయుడిని బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించారు. అనంతరం స్వామివారి చిత్రపటం, ప్రసాదాలను అందజేశారు. మహానందిలో బ్రహ్మోత్సవాలకు కూడా రావాలని నియోజకవర్గ ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి సీఎంను ఆహ్వానించారు.

కాగా.. నేటి నుంచి శ్రీశైలంకు వచ్చే భక్తులు నల్లమల అటవీమార్గంలో కాలినడకన ఆలయానికి చేరుకుని స్వామివారిని దర్శించుకునేందుకు అధికారులు అనుమతినిచ్చారు. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో రేపటి నుంచి శివస్వాములకు మాత్రమే ప్రత్యేక వేళల్లో స్వామివారి స్పర్శదర్శనం చేసుకునే అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు. ఇందుకు భక్తులు సహకరించాలని కోరారు. మహాశివరాత్రికి ఆలయానికి భక్తులు పోటెత్తనున్న క్రమంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా తొక్కిసలాట జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఫిబ్రవరి 18 వరకూ జరిగే శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు, వాహన సేవలు నిర్వహించనున్నారు.

Next Story