- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఒంటిమిట్టలో శ్రీరాముని కల్యాణ మహోత్సవాలు ప్రారంభం.. కల్యాణ ముహూర్తమిదే
ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో సీతారామచంద్రుల కల్యాణోత్సవాలు ప్రారంభమయ్యాయి. హరిద్రా ఘటనం ఘనంగా నిర్వహించారు.

దిశ, వెబ్‌డెస్క్: కడప జిల్లాలోని ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో అత్యంత వైభవంగా జరిగే శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల్లో భాగంగా, స్వామివారి కల్యాణ మహోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. దక్షిణ అయోధ్యగా ప్రసిద్ధి గాంచిన ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో మంగళవారం శాస్త్రోక్తంగా నిర్వహించిన ‘హరిద్రా ఘటనం’ (పసుపు దంచే కార్యక్రమం) తో ఈ వేడుకలు కల్యాణ మహోత్సవాలు ప్రారంభమయ్యాయి.
కల్యాణ వేడుకల సందర్భంగా స్వామివారికి మరియు అమ్మవార్లకు పట్టువస్త్రాలు, దివ్యాభరణాలతో అత్యంత సుందరంగా అలంకరించారు. గర్భాలయంలో స్వామివారి పాదాల చెంత పసుపు కొమ్ములు, రోళ్లు - రోకళ్లకు అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల మధ్య ఈ కార్యక్రమం సాగింది. సంప్రదాయబద్ధంగా మహిళా భక్తులు రోలులో పసుపు కొమ్ములను దంచి, కల్యాణానికి కావలసిన పసుపును సిద్ధం చేశారు. ఈ పసుపునే స్వామివారి కల్యాణంలో వినియోగిస్తారు. పసుపు దంచుతున్న సమయంలో భక్తులు చేసిన 'జైశ్రీరామ్' నామస్మరణతో కోదండ రామాలయ ప్రాంగణం మారుమోగిపోయింది. చైత్రశుద్ధ చతుర్దశి, ఏప్రిల్ 1వ తేదీ సాయంత్రం 6.30 గంటల నుంచి రాత్రి 8.30 గంటల మధ్య సీతారామ కల్యాణోత్సవం నిండు వెన్నెలలో కన్నులపండువగా జరగనుంది. అదేరోజు రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం చంద్రబాబు నాయుడు పట్టువస్త్రాలను సమర్పించనున్నారు. ఈ మేరకు ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.






