నెల్లూరు కార్పొరేషన్‌లో అవిశ్వాసం : మేయర్ పీఠంపై సర్వత్రా ఉత్కంఠ!

by Thanuru Gopichand |   (  Updated:2025-11-28 03:19:15  IST  )

నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ (NMC)లో మేయర్ పొట్లూరి స్రవంతికి పదవీ గండం ముంచుకొచ్చింది.

నెల్లూరు కార్పొరేషన్‌లో అవిశ్వాసం : మేయర్ పీఠంపై సర్వత్రా ఉత్కంఠ!
X

దిశ, వెబ్ డెస్క్ : నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ (NMC)లో మేయర్ పొట్లూరి స్రవంతికి పదవీ గండం ముంచుకొచ్చింది. ఆమెపై అవిశ్వాస తీర్మానం నోటీసును కార్పొరేటర్లు సంయుక్త కలెక్టర్ (JC)కు అందజేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో, ఈ అవిశ్వాస తీర్మానం నెల్లూరు రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ​నగర మేయర్ పొట్లూరి స్రవంతి పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని కోరుతూ, ఇద్దరు డిప్యూటీ మేయర్‌లతో సహా 40 మంది కార్పొరేటర్లు సోమవారం జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లుకు నోటీసు అందజేశారు. మున్సిపల్ కార్పొరేషన్ చట్టంలోని సెక్షన్ 91/A ప్రకారం ఈ నోటీసును ఇచ్చినట్లు డిప్యూటీ మేయర్‌లు, టీడీపీ నేతలు వెల్లడించారు.

​ప్రధాన ఆరోపణలు

మేయర్ దంపతులు నగర అభివృద్ధి పనులకు అడుగడుగునా ఆటంకాలు సృష్టిస్తున్నారని కార్పొరేటర్లు ఆరోపించారు. మేయర్ దంపతుల అవినీతితో ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందని ఫిర్యాదు చేశారు. వారి జోక్యం, చేతివాటం కారణంగా కార్పొరేషన్ కార్యాలయంలో ముఖ్యమైన దస్త్రాలు కదలడం లేదని కార్పొరేటర్లు వాపోతున్న విషయం విదితమే.

వైసీపీ హయాంలో

వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పొట్లూరి స్రవంతి మేయర్ గా ఎన్నికయ్యారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు, ఆ తర్వాత పార్టీ మారడంపై తర్జనభర్జన పడ్డారనే అభిప్రాయాలు పలువురు నేతలు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం తటస్థంగా ఉన్నట్లు చెబుతున్నారు. అయితే ఆమెపై అవిశ్వాసం నేపథ్యంలో వైసీపీ కూడా తన స్టాండ్ మార్చుకున్నట్లు కనిపిస్తోంది. అసలు తమ పార్టీకి సంబంధం లేదని చెప్పడం ఆమె పరిస్థితిని 'ముందు నుయ్యి-వెనుక గొయ్యి' మాదిరిగా మార్చిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

​కూటమి చేతికి మేయర్ పీఠం

​ప్రస్తుతం నెల్లూరు కార్పొరేషన్‌లో తెలుగుదేశం పార్టీ (టీడీపీ) బలంగా ఉంది. కార్పొరేషన్ పరిధిలోని 54 డివిజన్లలో టీడీపీకి 43 మంది, వైసీపీకి 14 ఓట్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఇద్దరు డిప్యూటీ మేయర్‌లు, ఎక్స్-అఫిషియో సభ్యులు (ఎంపీ, మంత్రులు, ఎమ్మెల్యేలు) మద్దతుతో మేయర్ పీఠం కూటమి (NDA) వశం కావడం లాంఛనంగా కనిపిస్తోంది.

​మేయర్ స్పందన

​అవిశ్వాస తీర్మానంపై మేయర్ పొట్లూరి స్రవంతి (Potluri Sravanthi) స్పందిస్తూ, ఇది తమపై జరుగుతున్న కుట్ర అని ఆరోపించారు. స్థానిక ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సోదరులు తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని, రౌడీ రాజకీయాలను అరికట్టేందుకు కూటమి ప్రభుత్వ నాయకులు జోక్యం చేసుకోవాలని ఆమె కోరారు. తాను అభివృద్ధికి ఆటంకం కాదని, కార్పొరేషన్‌లో పనులు జరుగుతున్నాయని తమ వైపు వాదనను వినిపిస్తున్నారు.

త్వరలోనే ఓటింగ్

ప్రస్తుతం మేయర్ పొట్లూరి స్రవంతిపై అవిశ్వాస తీర్మానం నోటీసు జారీ అయ్యింది. టీడీపీ తరపున పలువురి పేర్లు మేయర్ పీఠం కోసం వినవస్తున్నాయి. మేయర్ పీఠం కూటమి చేతికి వెళ్లడం దాదాపు లాంఛనప్రాయం అయ్యింది. ఈ క్రమంలో ఎవరు పీఠాన్ని దక్కించుకుంటారనే చర్చ జోరుగా సాగుతోంది. పార్టీకి విధేయులు, అన్ని వర్గాల ఆదరణ కలిగిన వారే మేయర్ పీఠం ఎక్కుతారనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ​అవిశ్వాస తీర్మానం నోటీసు అందిన నేపథ్యంలో, మున్సిపల్ కార్పొరేషన్ చట్టం ప్రకారం త్వరలోనే ఓటింగ్ నిర్వహించడానికి అధికారులు సమావేశం తేదీని నిర్ణయించే అవకాశం ఉన్నట్లు తెలియవస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో, నెల్లూరు మేయర్ పీఠంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Next Story