నెల్లూరులో ఎక్స్ ప్రెస్ వే నిర్మించాలి : ఎమ్మెల్యే సోమిరెడ్డి

by Thanuru Gopichand |

హైదరాబాద్ లోని పీవీ నరసింహరావు (PV Narasimha Rao Express Way) ఎక్స్ ప్రెస్ వే తరహాలో నెల్లూరులో కూడా ఎక్స్ ప్రెస్ వే నిర్మించాలని సర్వేపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు.

నెల్లూరులో ఎక్స్ ప్రెస్ వే నిర్మించాలి : ఎమ్మెల్యే సోమిరెడ్డి
X

దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్ లోని పీవీ నరసింహరావు (PV Narasimha Rao Express Way) ఎక్స్ ప్రెస్ వే తరహాలో నెల్లూరులో కూడా ఎక్స్ ప్రెస్ వే నిర్మించాలని సర్వేపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి (Nithin Gadkari) లేఖ రాసినట్లు పేర్కొన్నారు. నెల్లూరు – చెన్నైల మధ్య జాతీయ రహదారిని ఆరులేన్లుగా విస్తరించేందుకు అనుమతి ఇచ్చినందుకు ధన్యవాదాలను తెలిపారు. నెల్లూరు కార్పొరేషన్ (Nellore Coraporation) పరిధిలోని అయ్యప్పగుడి, కనుపర్తిపాడు, చింతారెడ్డిపాళెం క్రాస్ రోడ్డు వద్ద రోడ్డు అండర్ బ్రిడ్జీల (ఆర్.యూ.బీ) నిర్మాణాలు చేపట్టినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న నెల్లూరు నగరంలో మౌలిక వసతుల బలోపేతానికి, రవాణా సదుపాయాల మెరుగుదలకు ఈ నిర్మాణాలు దోహదం చేస్తాయన్నారు.

మరోవైపు పెన్నానది వద్ద నుంచి బుజబుజనెల్లూరు (Buja Buja Nellore) వరకు జాతీయ రహదారికి ఇరువైపులా నెల్లూరు నగరం వేగంగా విస్తరిస్తోందన్నారు. హైవేకి ఇరువైపులా నివాసాలు, వాణిజ్య, పారిశ్రామిక నిర్మాణాలు పెరుగుతున్నాయని చెప్పారు. త్వరలో చేపట్టబోయే ఆరులేన్ల రహదారితో నగర అంతర్గత రోడ్డు నెట్ వర్క్ కీలకంగా మారనుందని పేర్కొన్నారు. వాహనాల రద్దీ పెరగడంతో పాటు రోడ్డు ప్రమాదాలు, ప్రాణనష్టం అధికమవుతున్నాయని వివరించారు. ఈ అంశాలన్నింటిని దృష్టిలో ఉంచుకుని ట్రాఫిక్ ను తగ్గించడంతో పాటు ప్రయాణికుల భద్రత నేపథ్యంలో ఎక్స్ ప్రెస్ వే నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు. హైదరాబాద్ లో మెహిదీపట్నం నుంచి విమానాశ్రయం వెళ్లే మార్గంలో నిర్మించిన తరహాలో పెన్నానది (Penna River) నుంచి బుజబుజనెల్లూరు వరకు ఎక్స్ ప్రెస్ వే నిర్మించాలని కేంద్రమంత్రిని కోరారు. ఎక్స్ ప్రెస్ వే అందుబాటులోకి వస్తే ట్రాఫిక్ సమస్య పరిష్కారమై రోడ్డు ప్రమాదాలు తగ్గడమే కాకుండా నెల్లూరు నగరం మరింత అభివృద్ధి చెందేందుకు దోహదం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Next Story