ప్రతిభకు అంగవైకల్యం అడ్డు రాకూడదు : ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి

by Thanuru Gopichand |

ప్రతిభకు అంగవైకల్యం అడ్డు రాకూడదనే లక్ష్యంతో తాము పని చేస్తున్నామని నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి (Vemi Reddy Prabhakar Reddy) అన్నారు.

ప్రతిభకు అంగవైకల్యం అడ్డు రాకూడదు : ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి
X

దిశ, వెబ్ డెస్క్ : ప్రతిభకు అంగవైకల్యం అడ్డు రాకూడదనే లక్ష్యంతో తాము పని చేస్తున్నామని నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి (Vemi Reddy Prabhakar Reddy) అన్నారు. అందుకే విపిఆర్ ఫౌండేషన్ (VPR Foundation) ఆధ్వర్యంలో దివ్యాంగుల కోసం ప్రత్యేక సేవా కార్యక్రమాలను చేపట్టామని పేర్కొన్నారు. ఈ మేరకు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచితంగా ఎలక్ట్రిక్ ట్రై సైకిల్స్ పంపిణి చేస్తున్నామని తెలిపారు. తమ కార్యక్రమంలో భాగంగా ఉచిత ఎలక్ట్రిక్ ట్రై సైకిల్స్ పంపిణీని నెల్లూరు సిటీలో నిర్వహించారు. ఈ పంపిణీ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ ముఖ్య ఆహ్వానితులుగా హాజరయ్యారు. నెల్లూరు సిటీ నియోజకవర్గానికి చెందిన దివ్యాంగులు కార్యక్రమానికి తరలివచ్చారు. వారికి మంత్రి నారాయణతో కలిసి ఉచిత ఎలక్ట్రిక్ ట్రై సైనిల్స్ ను ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పంపిణీ చేశారు. కార్యక్రమంలో వారితో పాటు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి కూడా ఉన్నారు. విపిఆర్ కన్వెన్షన్ సెంటరులో జరిగిన ఈ పంపినీ కార్యక్రమంలో ఎంపీ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ దివ్యాంగులకు అండగా నిలవాలనే సదుద్దేశంతో ఎలక్ట్రిక్ ట్రై సైకిల్ పంపిణీ చేపడుతున్నాం అన్నారు. పార్లమెంట్ పరిధిలోని దివ్యాంగులకు సేవా కార్యక్రమ ఫలితం దక్కేలా చూస్తామన్నారు. ఎందుకంటే ప్రతిభకు అంగ వైకల్యం ఏ మాత్రం అడ్డుకాదని స్పష్టం చేశారు. ఆ ప్రతిభను వెలికి తీసేందుకు తమ వంతు సాయం ఎల్లప్పుడూ చేస్తామన్నారు. దివ్యాంగులు కూడా స్వయం ఉపాధి పొంది స్వశక్తితో ఎదగాలని ఆకాంక్షించారు. మంత్రి నారాయణ మాట్లాడుతూ విపిఆర్ ఫౌండేషన్ చేస్తున్న సేవలను అభినందించారు. దివ్యాంగుల కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా పార్టీ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్, ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి, రూప్ కుమార్ యాదవ్, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Next Story