- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పరిశ్రమల స్థాపనలో ఇక జెట్ స్పీడ్.. సీఎం చంద్రబాబు కీలక నిర్ణయాలు
ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమల ఏర్పాటు ప్రక్రియను మరింత వేగవంతం చేసేలా ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది.

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమల ఏర్పాటు ప్రక్రియను మరింత వేగవంతం చేసేలా ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. సోమవారం సచివాలయంలో కేంద్ర స్టీల్ సెక్రటరీ సందీప్ పౌండ్రిక్ నేతృత్వంలోని ప్రతినిధి బృందంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్రం ప్రతిపాదించిన ‘డీ-రెగ్యులేషన్ ఫేజ్-2’ అంశాలపై లోతుగా చర్చించారు.
వంద లోపునకే నిబంధనలు..
పరిశ్రమల అనుమతుల కోసం ప్రస్తుతం ఉన్న సంక్లిష్టమైన నిబంధనలను భారీగా తగ్గించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ప్రస్తుతం అమలులో ఉన్న దాదాపు 800కు పైగా నిబంధనలను వంద లోపునకు కుదించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సహా అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. అనుమతులు, లైసెన్సుల సంఖ్య సింగిల్ డిజిట్‌లోనే ఉండాలని స్పష్టం చేశారు. "ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ (Ease of Doing Business) దశ దాటి ఇప్పుడు మనం స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ (Speed of Doing Business) దిశగా సాగాలి" అని ఆయన అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ఒక్కసారి రిజిస్ట్రేషన్ చేసుకుంటే అది జీవితకాలం చెల్లుబాటు అయ్యేలా చూడాలని, డబుల్ లైసెన్సింగ్ విధానానికి స్వస్తి పలకాలని సూచించారు. దరఖాస్తు స్వీకరణ నుంచి అనుమతుల జారీ వరకు అంతా ఆన్‌లైన్ విధానంలోనే జరగాలని, దీనివల్ల పరిశ్రమల ఏర్పాటు సమయం 40 శాతం మేర తగ్గుతుందని సీఎం పేర్కొన్నారు. అనుమతుల సరళీకరణ పేరుతో ప్రజల భద్రత, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడకూడదని తేల్చి చెప్పారు. ఫైర్ సేఫ్టీ విషయంలో నేషనల్ బిల్డింగ్ కోడ్ స్థానంలో రాష్ట్ర స్థాయి నిబంధనలను తీసుకురావాలని, వేధింపులకు తావులేకుండా థర్డ్ పార్టీ తనిఖీలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు.
టెక్నాలజీకి పెద్దపీట - ఏఐ వినియోగం
ప్రభుత్వ పాలనలో వేగం పెంచడానికి టెక్నాలజీని విరివిగా వాడాలని చంద్రబాబు సూచించారు. డీ-రెగ్యులేషన్ ఫేజ్-3లో భాగంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టూల్స్ వాడాలని కేంద్ర బృందానికి ప్రతిపాదించారు. రాష్ట్రంలో ఇప్పటికే డేటా లేక్, వాట్సాప్ గవర్నెన్స్, అవేర్-2.0 వంటి అత్యాధునిక వ్యవస్థలను వినియోగిస్తున్నట్లు ఆయన వివరించారు. రాష్ట్రంలో ఈ సంస్కరణలను అమలు చేయడానికి మే నెలాఖరులోగా అవసరమైన ఆర్డినెన్సులను సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి అధికారులకు స్పష్టమైన గడువు విధించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుసరిస్తున్న ఈ వేగవంతమైన విధానాలు కేంద్ర ప్రతిపాదనల కంటే ఒకడుగు ముందే ఉన్నాయని స్టీల్ సెక్రటరీ సందీప్ పౌండ్రిక్ ఈ సందర్భంగా ప్రశంసించారు.






