- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
44 ఏళ్ల తెలుగుదేశానికి 43 ఏళ్ల వారసుడు నారా లోకేశ్
44 ఏళ్ల పార్టీ దిశా దశ మారుస్తూ అప్రతిహత విజయాలతో ముందుకు తీసుకెళుతున్న ఆ మూడో తరం శక్తి 43 ఏళ్ల నవ యువ యువకుడు నారా లోకేశ్.

తెలుగుదేశం.. నవ తేజం
- తాతయ్య సంక్షేమం.. తండ్రి అభివృద్ధి.. కలగలిసిన లోకేశ్ విజయ వ్యూహాలు
_ తండ్రిని జైల్లో పెట్టినా చెదరని ధీశాలి
_ మోడీ, పవన్‌లను సైకిల్ ఎక్కించిన సమన్వయకర్త
- టీడీపీ అంటే సంక్షేమం, అభివృద్ధి మాత్రమే కాదు.. రెడ్‌బుక్‌తో దెబ్బకు దెబ్బ రుచి చూపిస్తామని ప్రత్యర్థులకు సవాల్
- 44 ఏళ్ల తెలుగుదేశానికి 43 ఏళ్ల వారసుడు మంత్రి నారా లోకేశ్
- భావి ముఖ్యమంత్రిగా పార్టీ వర్గాల్లో బలమైన ముద్ర
దిశ, ఏపీ బ్యూరో: తెలుగుదేశం పార్టీని స్థాపించిన తొమ్మిది నెలల్లోనే అధికారం సాధించిన ధీశాలి తాత ఎన్టీఆర్. నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా ఇండియాలోనే విజనరీ లీడర్ తండ్రి చంద్రబాబు నాయుడు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని దేశ రాజధాని ఢిల్లీలో ఎన్టీఆర్ ఎలుగెత్తి చాటితే, తెలుగోడి బుర్రకున్న పదునేంటో దేశానికి చాటి చెప్పిన సమర్థ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఆ ఇద్దరు నేతల వారసుడిగా తాతయ్య ధైర్యం తండ్రి నైజం పునికి పుచ్చుకున్నారు నారా లోకేశ్. వైసీపీ గాలిలో 2019 ఎన్నికల్లో పార్టీ 23 సీట్లకు పడిపోయినా, మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న తండ్రిని జైల్లో పెట్టి నా భయపడలేదు. 2024 ఎన్నికల్లో ఒంటి చేత్తో పార్టీని తిరిగి అఖండ మెజార్టీతో గెలిపించడంలో లోకేశ్ పాత్ర అత్యంత కీలకం. ఇది ప్రత్యర్ధులు సైతం అంగీకరించినని సత్యం. 44 ఏళ్ల పార్టీ దిశా దశ మారుస్తూ అప్రతిహత విజయాలతో ముందుకు తీసుకెళుతున్న ఆ మూడో తరం శక్తి 43 ఏళ్ల నవ యువ యువకుడు నారా లోకేశ్.
టీడీపీ ఆవిర్భావమే సంచలనం..
తెలుగుదేశం.. ఈ పేరంటే ఓ ఆవేశం.. అభివృద్ధికి పర్యాయపదం. ఈ పార్టీ ఆవిర్భావమే ఓ సంచలనం. ఆత్మగౌరవ నినాదంతో.. సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అనే సిద్ధాంతంతో.. పేదల అభ్యున్నతే లక్ష్యంగా ఎన్టీఆర్ స్థాపించిన ఈ పార్టీ.. ఆయన హయాంలో అదే దిశగా పయనించింది. సంక్షేమ పథకాలకు నాంది పలికింది. రూ.2కే కిలో బియ్యం, సగం ధరకే జనతా వస్త్రాల పంపిణీ, పక్కా ఇళ్ల నిర్మాణం, రైతులకు రూ.50 హార్స్ పవర్ విద్యుత్, వృద్ధాప్య పింఛన్ వంటి అనేక సంచలన పథకాలను ప్రవేశ పెట్టింది. రాష్ట్రాన్ని సంక్షేమ పథంలో నడిపింది. ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు పగ్గాలు చేపట్టిన తర్వాత టీడీపీ తన దిశను మార్చుకుంది. అప్పటి రాష్ట్ర పరిస్థితులకు అనుగుణంగా సంక్షేమాన్ని పక్కనబెట్టి, అభివృద్ధిని పట్టాలెక్కించారు. ఐటీ సహా పారిశ్రామిక రంగంపై దృష్టి పెట్టారు. రాష్ట్ర ఆదాయాన్ని భారీగా పెంచారు. సంచలనాత్మక సంస్కరణలను ప్రవేశపెట్టారు. రాష్ట్రాన్ని మిగులు బడ్జెట్‌లోకి తెచ్చారు. ప్రజల ఆదాయాన్ని పెంచడంతో పాటు, వారి జీవన స్థితి గతులను పూర్తిగా మార్చివేశారు. తదనంతర పరిస్థితులలో మళ్లీ సంక్షేమ బాట పట్టినప్పటికీ, అభివృద్ధి మంత్రాన్ని మాత్రం వీడలేదు. ఇలా రెండు తరాలలో భిన్న విధానాలను అవలంబించిన టీడీపీకి.. ఇప్పుడు మూడో తరం నాయకత్వం వహిస్తోంది. నారా లోకేశ్.. తాత లోని ఆవేశం.. తండ్రిలోని ఆలోచన.. కలగలిసిన తత్వానికి తనదైన దూకుడును జోడించి.. దూసుకుపోతున్నారు. భవిష్యత్తులో పార్టీ ఏదిశలో పయనించ బోతోందో ఇప్పటికే ఓ స్పష్టతనిచ్చేశారు. రేపు పార్టీ అధ్యక్షుడిగా, సీఎం గా బాధ్యతలు స్వీకరిస్తే.. రాజకీయ ముఖచిత్రం ఎలా ఉండబోతోందో ఇప్పటికే ప్రత్యర్థులకు చెప్పకనే చెప్పేశారు. ప్రతిపక్షాన్ని ఢీ అంటే ఢీ అంటూ ఢీకొంటున్నారు. రెడ్ బుక్ తో ఇప్పటికే ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తున్నారు. తండ్రిలా చూసీ చూడనట్లు పోనని స్పష్టతనిచ్చేశారు.
నాయకత్వ పటిమకు సానబెట్టి..
ఓ విధంగా లోకేశ్‌లోని నాయకత్వ పటిమకు సానబెట్టి.. ఆయనను రాటుదేల్చింది వైసీపీ నాయకులే అని చెప్పొచ్చు. రాజకీయ అరంగేట్రం చేసినప్పటి నుంచి అనేక విధాలుగా అవమానిస్తూ, వెకిలి మాటలతో గెలిచేస్తూ.. లోకేశ్‌లో ఓ విధమైన పట్టుదలను పెంచింది వైసీపీ అనడంలో సందేహం లేదు. అసెంబ్లీలో ఆయన తల్లిని దారుణంగా అవమానించడంతోపాటు తండ్రిని కక్షపూరితంగా జైలుకు పంపి వేధించారు. ఆయన పాదయాత్రకు అనేక ఆటంకాలు కల్పించారు. ముఖ్యంగా ఈ మూడు సందర్భాలు ఆయనను రాటుదేల్చాయి. ప్రత్యర్థులను ఎలా ఎదుర్కోవాలో నేర్పించాయి. కసిని పెంచాయి. పార్టీని ఎలా నడపాలో అర్థమయ్యేలా చేశాయి. దూకుడు స్వభావాన్ని అలవరిచాయి. అదే దూకుడు ఇప్పుడు ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టిస్తోంది. భావి ముఖ్యమంత్రిగా ఆయన్ని తట్టుకొని నిలబడడం కష్టమన్న విషయాన్ని స్పష్టం చేస్తోంది.






