కాంగ్రెస్‌లో కొత్త పంచాయితీ..వైఎస్ఆర్ క్రెడిట్ అంతా జగన్ కొట్టుకు పాయే..!

by velandi.Saikiran |   (  Updated:2026-03-20 22:30:55  IST  )

ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం కల్పించాలని, 2004, 2009 మాదిరిగా మరోసారి ఏపీ గడ్డపై కాంగ్రెస్ జెండా పాతాలని ఆ పార్టీ హై కమాండ్ కలలు కంటోంది.

కాంగ్రెస్‌లో కొత్త పంచాయితీ..వైఎస్ఆర్ క్రెడిట్ అంతా జగన్ కొట్టుకు పాయే..!
X

కాంగ్రెస్‌లో కొత్త పంచాయితీ!

_ వైఎస్ఆర్ క్రెడిట్ అంతా కొడుకు జగన్ కొట్టుకు పాయే..

_ కాంగ్రెస్ మెడకు ఆస్తుల పంచాయితీ,

వివేకా హత్య కేసు చుట్టిన షర్మిల

_ వైఎస్ ఇమేజ్‌తో కాంగ్రెస్‌కు గత వైభవం

తెస్తుందని షర్మిలపై అధిష్టానం ఆశలు

_ ఆస్తులు వివాదం తప్ప పార్టీ

బలోపేతంపై శ్రద్ధ పెట్టని ఏపీసీసీ చీఫ్

దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం కల్పించాలని, 2004, 2009 మాదిరిగా మరోసారి ఏపీ గడ్డపై కాంగ్రెస్ జెండా పాతాలని ఆ పార్టీ హై కమాండ్ కలలు కంటోంది. ఆ కలలు సాకారం చేసుకోవడానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వరుసగా రెండు సార్లు కాంగ్రెస్‌ను గెలిపించి, అధికారం కట్టబెట్టిన దివంగత మాజీ సీఎం డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిలకు రాష్ట్ర పార్టీ అధ్యక్ష బాధ్యతలను కట్టబెట్టారు. కాంగ్రెస్ అగ్రనేత సోనియా, రాహుల్, మల్లికార్జున్ ఖర్గేలు స్వయంగా షర్మిలను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ కండువాను ఆమె మెడలో కప్పి ఏపీ అధ్యక్ష బాధ్యతలను అప్పగించారు.

షర్మిల చరిష్మాతో పార్టీ బలోపేతంపై ఆశలు

రాష్ట్ర విభజనతో ఏపీలో తుడిచి పెట్టుకు పోయిన కాంగ్రెస్ పార్టీని షర్మిల తిరిగి బలోపేతం చేస్తుందని ఆశించారు. తండ్రి వైఎస్ఆర్ లాగా కాంగ్రెస్ పార్టీని విజయం వైపుకు నడిపిస్తుందని ఆశపడ్డారు. షర్మిల చరిష్మాతో 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఏపీ అసెంబ్లీ, లోక్ సభలో ప్రాతినిధ్యం దక్కుతుందని ఊహించారు. అయితే, ఢిల్లీ హై కమాండ్ ఆలోచనలు అంచనాలకు భిన్నంగా ఆ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. కనీసం కడప లోక్ సభ నుండి పోటీ చేసిన ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైయస్ షర్మిల కూడా ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేస్తున్న రాజశేఖర్ రెడ్డి కుమార్తెను గెలిపించాలని కోరుతూ స్వయంగా ఆమె తల్లి విజయలక్ష్మి ఓటర్లకు విజ్ఞప్తి చేసినా ఫలితం దక్కలేదు. ఏపీ ఓటర్లు కాంగ్రెస్ ను మరోసారి వరుసగా మూడో ఎన్నికల్లోను కాంగ్రెస్ పార్టీని ఛీకొట్టారు. ఒక్క అసెంబ్లీ స్థానంలో కానీ, ఎంపీ స్థానంలో కానీ కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వలేదు. అయితే ఆ ఎన్నికల్లో షర్మిల పార్టీ పరంగా ఓటమి ఎదుర్కొన్న ప్పటికీ, వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమారుడు వైఎస్ జగన్ ఓటమితో వ్యక్తిగతంగా విజయం సాధించిందని కాంగ్రెస్ సహా పలు రాజకీయ పార్టీల నేతల, విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.

ఎన్నికల తర్వాతా అదే తీరు..

ఎన్నికలకు ముందు షర్మిల పార్టీ అధ్యక్ష పగ్గాలు స్వీకరించడంతో సమయాభావం వల్ల పార్టీనీ గెలిపించలేకపోయారని కాంగ్రెస్ నేతలు భావించారు. అప్పుడు అధికారంలో ఉన్న జగన్ పై ప్రతిపక్ష పార్టీ అధ్యక్షురాలుగా తీవ్ర స్థాయిలో ఆరోపణలు విమర్శలు చేసినప్పటికీ షర్మిలపై పార్టీలో పెద్దగా వ్యతిరేకత కనిపించలేదు. అయితే ఎన్నికల తర్వాత కూడా షర్మిల అదే తీరును కొనసాగించడంపై కాంగ్రెస్ వర్గాల్లో విస్మయం వ్యక్తం అవుతుంది. అధికార పార్టీని ప్రధానంగా కూటమి ప్రభుత్వ తప్పొప్పులపై విమర్శలు చేయాల్సిన షర్మిల ప్రతి విషయంలోనూ మాజీ సీఎం జగన్ పై విమర్శలు చేయడం సొంత పార్టీ నేతలకు కొరుకుడు పడడం లేదు. కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ. కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయడమే లక్ష్యంగా పుట్టిన పార్టీ తెలుగుదేశం. అయితే షర్మిల మాత్రం తెలుగుదేశం నీడలో నిలబడి జగన్ పై విరుచుకుపడుతున్నారని కాంగ్రెస్ పార్టీలోనే పలువు సీనియర్లు పిచ్చా పాటీగా ఆఫ్ ది రికార్డు మాట్లాడుతున్నారని సమాచారం. కాంగ్రెస్ పార్టీని ఒంటి చేత్తో రెండు సార్లు అధికారంలోకి తీసుకువచ్చిన రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో హఠాత్ మరణం తర్వాత కాంగ్రెస్ హై కమాండ్ వైఖరి ఆయన కుటుంబం పట్ల కఠినంగా మారిందని, అందువల్లనే రాజశేఖర్ రెడ్డి కుమారుడు జగన్ ఆ పార్టీ కి రాజీనామా చేసి సొంతంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని పెట్టాడని ప్రస్తుతం జగన్ పార్టీలో ఉన్నది కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలేనని వారంటున్నారు. రాజశేఖర్ రెడ్డి కుమారుని విమర్శించి ఆయన ప్రత్యర్థులకు మేలు చేసే చర్యలకు ప్రస్తుతమున్న కాంగ్రెస్ కేడర్ కూడా సహకరించదని వారు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ అధ్యక్షురాలు తన వ్యక్తిగత కక్షలు కోపాలు పగలు ప్రతీకారాలకు కాంగ్రెస్ జెండాను వాడుకోవడం మానేయాలని వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికైనా కాంగ్రెస్ నుండి ఎమ్మెల్యేలను, ఎంపీలను గెలిపించడానికి కృషి చేయాలని ఇతర పార్టీలో ఉన్న కాంగ్రెస్ నేతలను తిరిగి పార్టీలోకి తీసుకురావడానికి కృషి చేయాలని సూచిస్తున్నారు.

ఇప్పటికే వైఎస్సార్ ఇమేజ్‌ను జగన్ పార్టీ సొంతం చేసుకుందని, ఆ విషయాన్ని షర్మిల అర్థం చేసుకుని రాజశేఖర్ రెడ్డి ఇమేజ్ ను తిరిగి కాంగ్రెస్ వైపు మళ్లించడానికి ప్రయత్నాలు ప్రారంభించాలని సూచిస్తున్నారు. అన్న జగన్ తో ఉన్న ఆస్తుల పంచాయితీ, వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసును కాంగ్రెస్ మెడకు తగిలించ వద్దని షర్మిలకు సలహా ఇస్తున్నారు.

Next Story