ఢిల్లీలో ఏపీకి అరుదైన గౌరవం.. రిపబ్లిక్ డే వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా ఏటికొప్పాక బొమ్మలు

by Yella Dhawani Reddy |   (  Updated:2025-01-26 08:04:44  IST  )

ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఏపీ అనకాపల్లి జిల్లాలోని ఏటికొప్పాక లక్క బొమ్మలకు తాజాగా మరో అరుదైన గౌరవం దక్కింది.

ఢిల్లీలో ఏపీకి అరుదైన గౌరవం.. రిపబ్లిక్ డే వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా ఏటికొప్పాక బొమ్మలు
X

దిశ, వెబ్ డెస్క్: ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఏపీలోని ఏటికొప్పాక లక్క బొమ్మలకు తాజాగా మరో అరుదైన గౌరవం దక్కింది. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో నిర్వహించే పరేడ్‌లో శకట రూపంలో అలరించాయి. సహజసిద్ధమైన రంగుల వాడకం, జీఐ ట్యాగింగ్‌ వంటి ప్రత్యేకతలు ఉన్న ఏటికొప్పాక బొమ్మలతో రూపొందించిన శకటాన్ని రక్షణ శాఖ అధికారులు ఈఏడాది రిపబ్లిక్‌ డే పరేడ్‌కు ఎంపిక చేశారు. అంతేకాదు 'ఏటికొప్పాక బొమ్మలు- పర్యావరణహిత చెక్క బొమ్మలు' అంటూ ఏపీ ప్రభుత్వం రూపొందించిన ఈ శకటం రిపబ్లిక్ డే పరేడ్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ఏటికొప్పాక బొమ్మల చరిత్ర

అనకాపల్లి జిల్లా ఎలమంచిలి మండలంలోని ఏటికొప్పాక గ్రామస్థులు గత 400 ఏళ్లుగా ఈ బొమ్మలను తయారుచేస్తున్నారు. వంట చేసేందుకు కూడా పనికిరాని అంకుడు కర్రతో అద్భుతాలు సృష్టిస్తున్నారు. పూర్వం మహారాజులు వారి భవనాలలో అలంకరించుకునేందుకు ఈ బొమ్మలను తయారు చేయించేవారు. కాలక్రమేణ హస్తకళలను వృత్తిగా మార్చుకుని వంశపారంపర్యంగా అదేపని చేస్తున్నారు ఈ గ్రామస్థులు. అడవుల్లో అంకుడు కర్రను సేకరించి కొన్ని రోజులపాటు ఆరబెట్టిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కోస్తారు. ఆ తర్వాత బొమ్మకు కావాల్సిన ఆకృతిలో చెక్కి సహజసిద్ధమైన రంగులతో ప్రాణం పోస్తున్నారు. పిల్లలు ఆడుకునే బొమ్మల నుంచి ఇంట్లో అలంకరించుకునే రాణి రుద్రమదేవి, హరిదాసుల వరకు అన్ని రకాల బొమ్మలను తయారు చేస్తారు. ఈ బొమ్మల్లో ఎక్కడా పదునైన అంచులు లేకుండా ఎక్కడ పట్టుకున్న గుండ్రంగా, నునుపుగా ఉండేలా తయారు చేయడం ఈ కళాకారుల ప్రతిభకు తార్కాణంగా నిలుస్తోంది.

శకటం ప్రత్యేకత

రిపబ్లిక్ డే పరేడ్‌లో పాల్గొన్న ఈ ఏటికొప్పాక లక్క బొమ్మల శకటానికి ఒక ప్రత్యేకత ఉంది. శకటాన్ని ఆదిదేవుడు విగ్నేశ్వరుడు, తిరుమల వెంకన్న స్వామితో పాటు పల్లె వాతావరణం అన్ని ప్రతిబిపించేలా బొమ్మలు, హిందూ సంప్రదాయంలో జరిగే వివాహ వేడుక వధూవరులు, పురోహితుడు, సన్నాయి మేళం, వీణలు, హరిదాసు ఇతర దేవతామూర్తులతో రూపొందించారు. వాస్తవానికి ఇది ఎలమంచిలి మండలానికి చెందిన యువ కళాకారుడు సంతోష్ కుమార్ రూపొందించిన అద్భుతమైన బొమ్మల సమూహం. సంతోష్ చేసిన ఈ బొమ్మల సమూహాన్ని నమూనాగా.. పరేడ్‌కు పంపేందుకు రాష్ట్ర ప్రభుత్వం, సమాచార పౌర సంబంధాల శాఖ ప్రత్యేక శ్రద్ధ చూపి శకటాన్ని తయారు చేయించి ఏపీ ప్రభుత్వం తరఫున కేంద్రానికి ప్రతిపాదించారు. కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో రిపబ్లిక్ డే పరేడ్ వేడుకల్లో పాల్గొంది.

ఈ ఏటికొప్పాక లక్క బొమ్మల ప్రత్యేకత గురించి గతంలో మన్‌ కీ బాత్‌లో ప్రధాని మోదీ కూడా ప్రస్తావించారు. 2017లో ఈ బొమ్మలకు జిఐ విశిష్ట గుర్తింపు కూడా దక్కింది. ఈసారి దక్షిణాది రాష్ట్రాల నుంచి కేవలం ఏపీ, కర్ణాటక శకటాలను Republic Day పరేడ్‌లో ప్రదర్శించనున్నారు. తెలంగాణ శకటానికి చోటు దక్కలేదు.

Next Story